కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని (ఈ 20) ప్రోత్సహిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంతో మధ్యతగతి వాడే వాహనాలు తరచూ చెడిపోవడం, మైలేజ్‌పై ప్రభావం చూపడంతో మధ్య తరగతి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ సంబంధీకులకు సంబంధించిన కొన్ని కంపెనీలు ఇథనాల్ ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. వారికి ప్రయోజనం చేకూర్చేందుకే వాహనాల విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకోకుండా ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నా..కేంద్ర మాత్రం తన విధానాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తోంది.
ఇథనాల్ విధానం వల్ల ఆదాయం పెరగడమే కాకుండా దేశీయ ఇథనాల్ ఉత్పత్తితో మోనోపాలీ స్థాయికి కంపెనీలు ఎదిగాయి. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంజన్లపై తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇథనాల్ స్వభావరీత్యా తేమను ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. దీనివల్ల ఇంజన్ లోపలి భాగాలలో తుప్పుపట్టే అవకాశం అధికంగా ఉంటుంది.
పాత వాహనాలలో ఉపయోగించే రబ్బరు పైపులు, గాస్కెట్లు, సీళ్లు ఇథనాల్ వినియోగంతో త్వరగా అరిగిపోతాయి లేదా పగుళ్లు ఏర్పడతాయి. ఇథనాల్ మిశ్రమం కార్బ్యురేటర్‌ను, ఫ్యూయల్ ఇంజెక్టర్‌లను అధికంగా పాడుచేస్తుంది. దీని ఫలితంగా వాహన మరమ్మత్తు ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా 2000 సంవత్సరానికి ముందు తయారైన పాత వాహనాలు ఈ మిశ్రమ ఇంధనానికి అనుగుణంగా రూపొందించలేదు కాబట్టి, వాటి ఇంజన్లు వేగంగా పాడవుతున్నాయి.
-
ఇంధన సామర్థ్యం తగ్గిపోవడం
ఇథనాల్‌లో ఉండే శక్తి సాంద్రత పెట్రోల్‌తో పోలిస్తే దాదాపు 30% తక్కువగా ఉంటుంది. అంటే ఈ20 మిశ్రమం వినియోగించే వాహనాలు స్వచ్ఛమైన పెట్రోల్‌తో పోలిస్తే సుమారు 6 నుంచి 10% వరకు తక్కువ మైలేజీ ఇస్తాయి. రోజువారీ వాహన వినియోగదారులకు ఇది నేరుగా ఆర్థిక భారంగా మారుతుంది.
ఒక సగటు వ్యక్తి నెలకు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనిని పరిహరించడానికి వారు మరింత ఇంధనం నింపాల్సి రావడం మధ్యతరగతి నడ్డి విరుస్తుంది. ద్విచక్ర వాహనాలు, చిన్న యంత్రాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భారతదేశంలో కోట్లాది మంది ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాల ఇంజన్లు చాలా సున్నితంగా ఉంటాయి. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడటం వల్ల వీటి కార్బ్యురేటర్ తరచూ బ్లాక్ అవుతున్నాయి.
పంప్‌సెట్లు, జనరేటర్లు, వ్యవసాయ యంత్రాలు వంటి చిన్న ఇంజన్లు సైతం ఇథనాల్ మిశ్రమానికి తట్టుకోలేక పాడవుతున్నాయి. రైతులకు తమ వ్యవసాయ పరికరాలు మరమ్మతు చేయించుకోవడానికి అనవసరమైన ఖర్చులు పెరిగి రైతులను రుణగ్రస్తులను
చేస్తున్నాయి.
పర్యావరణానికి హాని
ఇథనాల్ తయారీకి ముఖ్యంగా చెరకు, మొక్కజొన్న, వరి వంటి ఆహార పంటలు ఉపయోగిస్తారు. ఇంధన అవసరాల కోసం ఈ పంటలను మళ్ళించడం వల్ల దేశంలో ఆహార సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా చక్కెర, ధాన్యం వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఇది నేరుగా ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది.
ఒకవైపు ఆకలి సమస్యలు పరిష్కారం కాకపోగా, ఆహార ధాన్యాలను వాహనాలకు వాడడం నైతికంగా కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. దేశంలో ఆహార ఉత్పత్తులు పెంచడానికి హరిత విప్లవం స్ఫూర్తిని సమాధి చేస్తుంది. ఇథనాల్ వినియోగంతో వచ్చే మరో పెద్ద ఉపద్రవం పర్యావరణ హాని. ఇథనాల్ ఇంధనంగా వాడటం పర్యావరణానికి హాని కలిగిస్తుంది. చెరకు తోటలకు అధిక నీరు అవసరమవుతుంది, దీని వల్ల భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయి.
ఇథనాల్ కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థ జలాలు నదులు, చెరువులను ఇప్పటికే కలుషితం చేస్తున్నాయి. అంతేకాకుండా ఇథనాల్ మిశ్రమం దహనమయ్యేటప్పుడు అసెటాల్డిహైడ్ వంటి హానికర రసాయనాలు వెలువడతాయి, ఇవి వాయు కాలుష్యాన్ని పెంచుతాయి. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
-
నిల్వ, పంపిణీలో సమస్యలు
ఇథనాల్ నీటిని శోషించుకునే స్వభావం కారణంగా దీర్ఘకాలిక నిల్వ కష్టంగా ఉంటుంది. పెట్రోల్ బంక్‌లలో ఉపయోగించే నిల్వ ట్యాంకులు, పైపులైన్లు ఇథనాల్ మిశ్రమానికి తట్టుకునేలా తయారుకాకపోతే త్వరగా పాడవుతాయి. వాటిని ప్రత్యేకంగా అప్‌గ్రేడ్ చేయడానికి భారీ పెట్టుబడి అవసరమవుతుంది, ఆ భారం చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది. దేశంలో మధ్యతరగతి వినియోగిస్తున్న వాహనాలపై ఇథనాల్ ప్రభావం ఒక బాంబు విధ్వంసంతో సమానం. ఇప్పటికైనా అమెరికాతో అధిక ధరకు ముడి చమురు సరఫరా చేసుకున్న ఇంధన ఒప్పందాలు రద్దు చేసుకుని ఇరాన్, రష్యాలాంటి శాశ్వత మిత్ర దేశాలలో తక్కువ రేటుకు సరఫరా ఒప్పందాలను ఖరారు చేసుకోవాలి.
- దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
