హైడ్రా పేరిట అక్రమంగా ఇండ్లకు మార్కింగ్.. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నారంటూ బెదిరింపులు

హైడ్రా పేరిట అక్రమంగా  ఇండ్లకు మార్కింగ్..  చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నారంటూ బెదిరింపులు
  • మేడిపల్లిలోని ద్వార‌కానగ‌ర్‌ నివాసితుల ఫిర్యాదుపై కమిషనర్ రంగనాథ్ స్పందన 
  • ఫీల్డ్​కు వెళ్లి పరిశీలిన.. వెంటనే మార్కింగ్ తొలగింపు
  • హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారుల తప్పున్నట్లు గుర్తింపు
  • అధికారులపై చర్యలకు సిఫార్సు

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైడ్రా అంటే అభ‌యమ‌ని, తమ పేరుతో అపోహలు సృష్టించి ప్రజలను భ‌యాందోళ‌ల‌న‌కు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హెచ్చరించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చెరువుల ఎఫ్టీఎల్ పేరిట భయపెట్టే వివిధ శాఖ‌ల అధికారుల‌కు గ‌ట్టి ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా పేరు చెప్పి కొందరు వ‌సూళ్లు చేస్తున్న ఘ‌ట‌న‌లు కూడా త‌మ దృష్టికి వ‌స్తున్నాయ‌ని, అలాంటి విష‌యాల‌ను స‌హించేది లేద‌న్నారు.

 మేడ్చల్ మ‌ల్కాజిగిరి జిల్లా మేడిప‌ల్లి మండ‌లం బోడుప్పల్ కుంట‌ (సుద్దకుంట చెరువు) సమీపంలోని ద్వార‌కానగ‌ర్‌ నివాసితుల ఫిర్యాదుల మేర‌కు శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుద్దకుంట‌ చెరువు సమీపంలో తాము 30 ఏండ్ల కింద ఇండ్లు నిర్మించుకుని ఉంటున్నామ‌ని.. ఇప్పుడు తమ నివాసాలు ఎఫ్టీఎల్ ప‌రిధిలోకి వ‌స్తున్నాయ‌ంటూ 
హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు బెదిరిస్తున్నారని స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 

ఈ చెరువుకు 2014లోనే డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ ఇచ్చి స‌ర్వే చేసి ఎఫ్టీఎల్ హ‌ద్దు రాళ్లు పాతారని, వాటిని ప‌ట్టించుకోకుండా అధికారులు, స్థానిక నాయ‌కులతో క‌లిసి హ‌ద్దులు మార్చివేశారన్నారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి మాట్లాడారు.

ఆ అధికారులపై చర్యలు తీసుకుంటం

అక్రమంగా ఇండ్లపై మార్కింగ్ వేసి భ‌య‌భ్రాంతులకు గురి చేసిన హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులపై చ‌ర్యలకు సిఫార్సు చేస్తామ‌ని రంగనాథ్ తెలిపారు. టెన్షన్​పడాల్సిన అవ‌స‌రం లేద‌ని హామీ ఇచ్చారు. 2014లోనే ఈ చెరువు 3.16 ఎకరాల మేర ఉందని హెచ్ఎండీఏ వాళ్లు ప్రిలిమిన‌రీ నోటిఫికేష‌న్ ఇచ్చార‌ని గుర్తు చేశారు. దాని ప్రకార‌మే చెరువు హ‌ద్దులు నిర్ణయించి కాపాడ‌తామ‌ని హామీ ఇచ్చారు. చెరువు హ‌ద్దులు మార్చివేసి ఇండ్లపై మార్కింగ్ వేసిన అధికారుల‌పై మండిపడ్డారు. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోకి వ‌స్తాయంటూ దాదాపు 48 ఇండ్లకి స్థానిక అధికారులు మార్కింగ్‌ చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఇండ్లపై వేసిన మార్కింగులు వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు. 

హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులు చేసిన ఫైన‌ల్ నోటిఫికేష‌న్ ప్రతిపాద‌న‌లు ప‌క్కన పెట్టి, డ్రాఫ్ట్ నోటిఫికేష‌న్ ప్రకార‌మే ముందుకు వెళ‌తామ‌ని స్పష్టం చేశారు. 2024 జులై 19వ తేదీన హైడ్రాను ప్రభుత్వం తీసుకువ‌చ్చింద‌ని, ఆ తేదీకి ముందు నుంచి నివాసం ఉంటున్న ఇండ్ల జోలికి వెళ్లబోమ‌ని రంగ‌నాథ్ స్పష్టం చేశారు. చెరువుకు నివాస ప్రాంతాల‌కు మ‌ధ్య 1990లోనే ర‌హ‌దారి నిర్మించిన‌ట్టు స్థానికులు చెబుతున్న విష‌యాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నట్టు క‌మిష‌న‌ర్ తెలిపారు. ఎవ‌రైనా లేనిపోని గంద‌ర‌గోళం సృష్టించి హైడ్రా పేరిట బెదిరింపుల‌కు పాల్పడితే వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని  హెచ్చరించారు. ప్రస్తుతం చెరువుల  వ‌ద్ద మిగిలిన భూమిలోనే వాటి పున‌రుద్ధర‌ణ‌, అభివృద్ధిని చేపడుతున్నామ‌ని స్పష్టం చేశారు.

హైడ్రాతో కలిసి పని చేయాలి

అలాగే అంబర్ పేటలోని బతుకమ్మకుంటను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం సందర్శించారు. సాయంత్రం 6 గంటల సమయంలో బతుకమ్మకుంట చుట్టూ వాకర్లతో కలిసి నడిచారు. బతుకమ్మ కుంట అభివృద్ధి పట్ల వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. చెరువును ఇంతే శుభ్రంగా కాపాడుకోడానికి హైడ్రాతో కలిసి పని చేయాలని కోరారు.