ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీపై ఎంక్వయిరీకి కమిటీ

ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీపై ఎంక్వయిరీకి కమిటీ

ఫీజుల పేరిట ప్రజలను పీడిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్
రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు: ఈటల
హైదరాబాద్‌‌, వెలుగు: ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫీజుల దోపిడీపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల విచారణకు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ శనివారం ఆదేశించారు. రూల్స్ పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రైవేటు హాస్పిటళ్లు కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, మానవతా దృక్పథం లేకుండా ప్రజలను పీడిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ట్రీట్‌‌మెంట్‌‌కు ప్రభుత్వం ధరలు ఫిక్స్ చేసినప్పటికీ.. పీపీఈ కిట్లు, మందులు, ఐసీయూ, హెల్త్ స్టాఫ్ కు అదనపు వేతనాలు అంటూ ప్రజల మీద భారం మోపుతున్నాయని మండిపడ్డారు. సాధారణ ధరల కంటే పది రెట్లు ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆఫీసర్లు మంత్రి దృష్టికి తీసుకురాగా..ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఫీజులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటులోని బెడ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందేలాచూడాలన్నారు. కష్టకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాపార కోణంలో ఆలోచించకుండా, ప్రజల ప్రాణాలు కాపాడటంలో తమ వంతు బాధ్యత పోషించాలని మంత్రి కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఉన్నఇబ్బందులను తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా ట్రీట్మెంట్ కు అవసరమైన ఖరీదైన మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ ‌‌సౌకర్యం వంటివన్నీ ప్రభుత్వ దవాఖాన్లలో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు కరోనా గురించి భయపడకుండా ప్రభుత్వ దవాఖాన్లలో చేరి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవాలని కోరారు.

మంత్రి దృష్టికి వచ్చిన ఫిర్యాదులు

ప్రైవేటు హాస్పిటళ్లు బెడ్ల ఖాళీ లేవని చెబుతూ కృత్రిమ కొరతను సృష్టించడం, రూ. 3 లక్షల నుంచి 4 లక్షల అడ్వాన్స్ కడితేనే పేషెంట్లను చేర్చుకోవడం, రోజుకు రూ. లక్ష నుంచి 2 లక్షల వరకూ చార్జ్ ‌‌చేయడం, పేషెంట్ మృతి చెందినా పూర్తి బిల్లు చెల్లించేవరకూ డెడ్ బాడీని అప్పగించకపోవడం, ఎసింప్ట‌మాటిక్ ‌పేషెంట్లను అడ్మిట్ చేసుకొని విపరీతంగా చార్జీలు వసూలు చేయడం, పేషెంట్ పరిస్థితి సీరియస్ అవగానే అంబులెన్స్‌‌లో పడేసి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించడం.. వంటి ఫిర్యాదులు వచ్చాయని మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనూ కరోనా ట్రీట్మెంట్

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కరోనా పేషెంట్లను పంపించాలని ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఈటల సూచించారు. టిమ్స్‌‌, కింగ్ ‌‌కోఠి హాస్పిటల్స్‌‌లోనూ కరోనా పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ అందించాలన్నారు. మల్లారెడ్డి, మమత,ఆర్వీఎం, ఎంఎన్‌‌ఆర్‌‌‌‌, అపోలో, కామినేని మెడికల్ కాలేజీల అనుబంధ హాస్పిటళ్ల‌లో కరోనా ట్రీట్మెంట్ అందేలా చూడాలన్నారు. ఎమర్జెన్సీ ఉన్నపేషెంట్లను మాత్రమే హైదరాబాద్ కు పంపించాలన్నారు.

పర్మిషన్ రద్దుకు యోచన

దోపిడీకి పాల్పడిన ప్రైవేటు హాస్పిటళ్ల‌కు కరోనా ట్రీట్‌‌మెంట్ పర్మిషన్ రద్దు చేయాలని సర్కార్ ‌‌‌‌యోచిస్తోంది. ఇప్పటికే పలు హాస్పిటళ్ల‌కు నోటీసులు ఇవ్వడంతో పాటు, కొన్ని హాస్పిటళ్ల‌లో రూల్స్ కు వ్యతిరేకంగా ఫీజు వసూలు చేసినట్టు ఆఫీసర్లు గుర్తించారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై మంత్రితో చర్చించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్పత్రుల పర్మిషన్‌‌ను పూర్తిగా రద్దు చేయడం కంటే.. ఆయా ఆస్పత్రులకు ఇచ్చిన కరోనా ట్రీట్‌‌మెంట్ అనుమతులనే రద్దు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు ఓ సీనియర్ ఆఫీసర్ చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..