- ఒలింపిక్ క్యాంప్ నుంచి తొలగింపు
న్యూఢిల్లీ : కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్, వెయిట్ లిఫ్టర్ అచింత షెయులి.. విమెన్స్ హాస్టల్‌లోకి చొరబడుతూ సెక్యూరిటీకి దొరికిపోయాడు. దీంతో అతన్ని పారిస్ ఒలింపిక్ ప్రిపరేషన్ క్యాంప్ నుంచి బహిష్కరించారు. గురువారం అర్ధరాత్రి ఎన్‌ఐఎస్ పటియాలలోని విమెన్స్ హాస్టల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 22 ఏళ్ల అచింత హాస్టల్‌లోకి ప్రవేశిస్తుండగా పట్టుకున్న భద్రతా సిబ్బంది వీడియో తీసి పై అధికారులకు పంపించారు.
‘అచింత క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని సాయ్, ఎన్‌ఐఎస్ పటియాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినీత్ కుమార్‌కు తెలియజేశాం. వీడియో సాక్ష్యాలు ఉన్నందున దర్యాప్తు ప్యానెల్‌ను ఏర్పాటు చేయలేదు. సాయ్ అధికారుల అదేశాల మేరకు అతన్ని క్యాంప్ నుంచి పంపించి వేశాం’ అని వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య తెలిపింది. బహిష్కరణ కారణంగా అచింత పుకెట్‌లో జరిగే పారిస్ గేమ్స్ క్వాలిఫికేషన్‌లో పాల్గొనే అవకాశం లేదు. దీంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయాడు.
