భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో గురువారం నిర్వహించిన బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ కొత్తగూడెం బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలు, కుట్రలు జరుగుతున్నాయన్నారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవపై చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో ఆగ్రహానికి దారితీశాయి. కొందరు ఆవేశంతో కుర్చీలు విరగ్గొట్టడంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
వేదిక నుంచి వెళ్లిపోతున్న రాఘవను తిరిగి స్టేజీపైకి ఆహ్వానించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గిట్టని వారు ప్రచారం చేసే మాటలను నమ్మవద్దని సూచించారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడడమే తన లక్ష్యమని, తాను ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని వనమా రాఘవ పేర్కొన్నారు.
