పోలింగ్‌‌‌‌ బూత్‌‌లపై ఏజెంట్స్‌‌ ఫార్ములా

పోలింగ్‌‌‌‌ బూత్‌‌లపై ఏజెంట్స్‌‌ ఫార్ములా

హైదరాబాద్‌‌, వెలుగు: పోలింగ్‌‌ రోజున పోలింగ్‌‌ బూత్‌‌ల్లో తమ వాళ్లను పెట్టుకొని పట్టు సాధించడానికి ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్త ట్రెండ్‌‌ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నది. పట్టు పెంచుకోవడానికే పార్టీలు తమ అనుచరులను ఇండిపెండెంట్​లుగా బరిలోకి దింపినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలో119 అసెంబ్లీ స్థానాల్లో దాఖలైన మొత్తం నామినేషన్లలో 2,290 అభ్యర్థులు బరిలో ఉన్నారు.  ఇందులో వందలాది మంది పార్టీ ఎమ్మెల్యేల అనుచరులే కావడం గమనార్హం.  

పట్టు కోసం కొత్త ఫార్ములా

సాధారణంగా పోలింగ్‌‌ రోజు బూత్‌‌లో పోటీ చేసే అభ్యర్థి తరఫున ఒక పోలింగ్‌‌ ఏజెంట్‌‌, ఆయనకు రిలీఫ్‌‌ ఇవ్వడానికి మరో ఇద్దరు వ్యక్తులకు దశల వారీగా అనుమతి ఉంటుంది. అయితే పోలింగ్‌‌ బూత్‌‌లో గట్టి పట్టు సాధించాలంటే పార్టీ ఏజెంట్‌‌తో పాటు ఆయనను సపోర్ట్‌‌ చేసేందుకు మరో ఒక్కరిద్దరు ఉండాలని అభ్యర్థులు భావిస్తున్నారు. అప్పుడే పోలింగ్‌‌ బూత్​పై తమ బలాన్ని నిరూపించుకునే అవకాశం ఉంటుందనేది అభ్యర్థుల ధీమా. వివాదాస్పద ప్రాంతాలు, పార్టీలు గలాటా సృష్టించే ఏరియాల్లో అభ్యర్థులు అనుచరులను పోటీలో దించే ఫార్ములా వాడినట్లు తెలుస్తున్నది. ఎన్నికల బరిలో ఒకరిద్దరు తమ వాళ్లే ఉన్నా ప్రతి బూత్‌‌లో తమ ఏజెంట్‌‌తో పాటు తమ అనుచరుల ఏజెంట్ల బలం ఉంటుంది.

దీంతో ఎన్నికల రోజున ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని సెన్సిటీవ్‌‌ ఏరియాల్లో బడా పార్టీల అభ్యర్థులు ఏజెంట్స్‌‌ ఫార్ములా ఫాలో అవుతున్నారు. హైదరాబాద్‌‌లోని ఓల్డ్‌‌ సిటీ, గోషామహల్‌‌, నాంపల్లి, ముషీరాబాద్‌‌, అంబర్‌‌పేట్‌‌, జూబ్లీహిల్స్‌‌, ముథోల్‌‌, బోధన్‌‌, నిజామాబాద్‌‌, వరంగల్‌‌ ఈస్ట్‌‌, వరంగల్ వెస్ట్‌‌, పరకాల, నర్సంపేట్‌‌ తదితర నియోజకవర్గాల్లో పలు పార్టీ అభ్యర్థులు ఇప్పటికే తమ అనుచరులతో నామినేషన్‌‌ వేయించినట్లు సమాచారం.