గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థ కోసం ఇండ్లు, భూములు త్యాగం చేశారా గ్రామస్తులు. అలాంటిది పూర్తిస్థాయిలో పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ చట్టం ప్రకారం ఇంటి స్థలాలు కేటాయించకుండానే, ఇండ్లను ఖాళీ చేయాలని వారిపై సింగరేణి ఆఫీసర్లు ఒత్తిడి తెస్తున్నారు. పోలీసులు అండతో బలవంతంగా ఇండ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తుండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రామగుండం ఏరియా3 పరిధిలోని ఓపెన్ కాస్ట్(ఓసీ) 2 విస్తరణలో భాగంగా నాలుగు గ్రామాల్లో భూములను సింగరేణి సేకరిస్తోంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని భూములు, 450 వరకు ఇండ్లను స్వాధీనం చేసుకుంటోంది. 2012-–13 నుంచే ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆర్‌అండ్‌ఆర్ యాక్ట్ ప్రకారం నిర్వాసితులకు ఇంటి స్థలం ఇవ్వాలి. ఈ మేరకు అదే మండల పరిధిలోని రత్నాపూర్, పన్నూరు గ్రామాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో సింగరేణికి ఉన్న ఖాళీ జాగాను లద్నాపూర్ నిర్వాసితులకు కేటాయించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. ఇందులో మంథని, పెద్దపల్లి రహదారికి ఆనుకుని రెండు వైపులా ఉన్న సైట్లు అనుకూలంగా లేవు. రోడ్డుకు 2 నుంచి 3 మీటర్ల లోతులో ఈ సైట్లు ఉన్నాయి. వానాకాలమంతా ఈ సైట్లలో నీళ్లు ఉంటాయి. దీంతో తొలుత గ్రామస్తులు ఇక్కడ ప్లాట్లు తీసుకునేందుకు ఒప్పుకోలేదు. ఈ సైట్లను డెవలప్ చేసి, రోడ్లు, డ్రైనేజీ, పవర్ సప్లై వంటి వర్క్స్ చేసి నివాసయోగ్యంగా మార్చి ఇస్తామని సింగరేణి ఆఫీసర్లు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఒప్పుకున్నారు.
ఖాళీ చేయకుంటే ట్రాన్స్‌ఫర్..
సైట్ డెవలప్‌మెంట్ పనులు మొదలు పెట్టకుండా ఏడాదిగా ఆఫీసర్లు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఓసీ విస్తరణకు గ్రామంలో రోడ్డుకు ఎడమవైపు ఉన్న ఇండ్ల సేకరణ తప్పనిసరి కావడంతో హడావుడిగా పన్నూరులోని ఆర్‌అండ్‌ఆర్ సైట్ డెవలప్‌మెంట్ పనులు మొదలుపెట్టారు. ‘లిస్ట్‌లో ఉన్నవాళ్లందరికీ నష్టపరిహారం చెల్లిస్తాం, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా ప్లాట్లు కేటాయిస్తాం, ఆర్నెళ్ల రెంట్ కట్టిస్తాం, ఫిబ్రవరి చివరికల్లా ఇండ్లు ఖాళీ చేయాలి’ అని జిల్లా జాయింట్ కలెక్టర్‌తో చెప్పించారు. అయిష్టంగానే గ్రామస్తులు ఇందుకు ఒప్పుకున్నారు. జేసీ చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు జరగాలి. అందరికీ నష్టపరిహారం అందాలి. కానీ, ఇప్పటివరకూ సైట్‌లో కనీసం 30 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. కనీసం ఇంకో 2 నెలలైతే తప్ప పనులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఇంకా కొంతమందికి పరిహారం డబ్బులు ఇవ్వనేలేదు. ఇంతలోనే ఇండ్లు ఖాళీ చేయాలంటూ గ్రామస్తులపై ఒత్తిడి చేస్తున్నారు. లద్నాపూర్‌కు చెందిన సింగరేణి రెగ్యులర్ ఎంప్లాయీస్ కొందరు ఓసీ 2లో పని చేస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేయకపోతే మణుగూరు, కొత్తగూడెం వంటి దూరప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తామని వీరిని బెదిరిస్తున్నారు. గ్రామంలో వ్యవసాయ భూములన్నీ సింగరేణి గతంలోనే స్వాధీనం చేసుకోవడంతో రైతులు, కూలీలంతా సింగరేణి ఓబీ కాంట్రాక్టర్ల దగ్గర డ్రైవర్లుగా, లేబర్లుగా చేస్తున్నారు. ఇండ్లు ఖాళీ చేయకపోతే పనిలోకి రానివ్వం అని వీరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. గతంలో పలుసార్లు ఇలాగే పనిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో తమ కుటుంబ మనుగడ ప్రమాదంలో పడుతుందని భయపడుతున్నారు.
నాసిరకంగా డెవలప్‌మెంట్..
నిర్వాసితుల కోసం డెవలప్ చేస్తున్న సైట్‌లో పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. మెయిన్ రోడ్డుకు 2, 3 మీటర్ల లోతులో సైట్ స్థలం ఉంది. సింగరేణి ఆఫీసర్లు తల్చుకుంటే వారం రోజుల్లో సైట్ స్థలంలో రోడ్డు కంటే ఎత్తుగా మట్టి కొట్టించొచ్చు. కానీ అలా చేయడం లేదు. కనీసం సైట్‌లో వేసే ఇంటర్నల్ రోడ్లను కూడా పైకి లేపకుండా నాసిరకంగా వేస్తున్నారు. దీంతో వర్షపు నీళ్లన్నీ ఈ రోడ్ల మీదే ఆగే అవకాశం ఉంది. ఇక ఇక్కడ ఇళ్లు కట్టాలంటే కనీసం రెండు మీటర్ల మేర మట్టి పోయించుకోవాల్సిన పరిస్థితి. లేదంటే వర్షపు నీళ్లన్నీ ఇండ్లలో చేరతాయి. ప్రస్తుతం ఉన్న రూల్స్ప్రకారం ఇంటర్నల్ రోడ్లు కనీసం 30 ఫీట్లు ఉండాలి. కానీ ఆర్‌అండ్‌ఆర్ సైట్‌లో 30 ఫీట్ల కంటే తక్కువ పెడుతున్నారని నిర్వాసితులు వాపోతున్నారు. అలాగే ప్రతి సైట్‌లో కచ్చితంగా ఒక పార్కు ఉండాలి. డెవలప్‌మెంట్ కోసం పదిశాతం ల్యాండ్ వదిలేయాలి. మూడు సైట్లు ఉంటే ఒక్క దాంట్లోనే ల్యాండ్ వదిలేశారు. మిగిలిన రెండు సైట్లలో ఈ రూల్స్ఏవీ అమలు కావడం లేదు. పవర్ సప్లై పనులు ఇంకా మొదలు కాలేదు. డ్రైనేజీ కనెక్షన్‌కు ప్రైవేటు భూములు సేకరించాల్సి వస్తుండడంతో ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, సింగరేణి ఉన్నతాధికారులు కలుగజేసుకుని సైట్ డెవలప్‌మెంట్ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని, ఇండ్లు నిర్మించుకునే వరకు గడువు ఇవ్వాలని కోరుతున్నారు.
ఒకేసారి అందరం ఏడికి పోవాలె?
ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకేసారి ఇన్ని కుటుంబాలు ఖాళీ చేసి ఏడికి పోవాలె. గొర్లు, బర్లు ఉన్నోళ్ల పరిస్థితి ఏంది? ఆర్నెళ్లలో కనీసం మాకు ప్లాట్లు కేటాయిస్తరో లేదో కూడా తెల్వదు. మేము ఖాళీ చేయకపోతే ఓసీ పనులు ఆగిపోతయని చెబుతున్నరు. ఆ విషయం ఆఫీసర్లకు మొదలు తెల్వదా. ఇప్పుడే తెలిసిందా. – పులి బాపుగౌడ్, లద్నాపూర్
