వచ్చే ఎన్నికల్లో నోబుల్స్, గోబెల్స్ మధ్య పోటీ : హరీశ్ రావు

వచ్చే ఎన్నికల్లో నోబుల్స్, గోబెల్స్ మధ్య పోటీ  : హరీశ్ రావు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నోబుల్స్, గోబెల్స్ మధ్య పోటీ జరగనుందని మంత్రి హరీశ్​రావు అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ ఇంట్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రతిపక్షాలు పగ వారిలాగా తయారయ్యాయని హరీశ్ విమర్శించారు. ‘‘పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు చేయని ప్రయత్నం లేదు. చేసింది చెప్పడం నోబుల్​అయితే, తప్పుడు ప్రచారాలు చేయడం గోబెల్స్. 50 ఏండ్ల పాలనలో కాంగ్రెస్​ చేయలేని పనులను తొమ్మిదేండ్లలో  కేసీఆర్ చేసి చూపించారు. 

కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఏమీ చేయడం లేదు. కానీ తెలంగాణలో మళ్లీ ఒక్క చాన్స్ అంటూ వస్తున్నారు” అని మండిపడ్డారు.  కాంగ్రెస్​ది తన్నుల సంస్కృతి అయితే, తమది టన్నుల సంస్కృతి అని విమర్శించారు. ఆలస్యంగానైనా ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించడం శుభపరిణామమని అన్నారు. నాలుగైదు నెలల్లో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి, ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. 

ఈ ఏడాది కృష్ణాకు వరదలు రాకపోవడంతో పంటలపై ప్రభావం పడిందని, అదే గోదావరి నీళ్లు పాలేరును చేరితే ఇక ఖమ్మం జిల్లాకు కరువు అనేదే ఉండదని చెప్పారు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఒకే స్థానాన్ని గెలిపించినా, ఖమ్మం జిల్లాపై కేసీఆర్​ఎంతో ప్రేమ చూపించారని మంత్రి పువ్వాడ అన్నారు.