మల్లన్న ఆలయ చైర్మన్ పదవికి పోటాపోటీ

మల్లన్న ఆలయ చైర్మన్ పదవికి పోటాపోటీ

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ పదవి కోసం పలువురు పోటాపోటీగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఆలయ తాజా మాజీ చైర్మన్ గీస భిక్షపతి, సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్ గౌడ్, ఓయూ జేఏసీ నేత, కుర్మ సంఘం నేత రాజుతో పాటు పలువురు చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. గీస భిక్షపతికే మరోసారి అవకాశం దక్కేలా స్థానిక ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులు ప్రారంభించినందున వాటిని సకాలంలో పూర్తి చేయాలంటే భిక్షపతి ఉండాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన మరుపల్లి  శ్రీనివాస్ గౌడ్ కు మంత్రి హరీశ్​రావు అండదండలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కొద్ది నెలల కింద శ్రీనివాస్ గౌడ్ కు కొమురవెల్లి ఆలయ చైర్మన్ పదవి లభించిందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడం గమనార్హం.

తెరపైకి గొల్లకురుమల డిమాండ్

గొల్ల కురుమల ఆరాధ్యదైవమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవిని గొల్ల కురుమలకే కేటాయించాలనే డిమాండ్ ప్రస్తుతం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో 40 లక్షల జనాభా ఉన్న తమ వర్గానికి చైర్మన్ పదవిని ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ చైతన్య యాత్రలతోపాటు కొమురవెల్లి లో గర్జన సభను నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఆలయ పాలక మండలి ఏర్పాటు కోసం ఈనెల 24 వరకు దేవాదాయ శాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆలయ అధికారులకు ఐదు దరఖాస్తులు అందగా, సంగారెడ్డితో పాటు హైదరాబాద్​లోని కమిషనర్ ఆఫీస్ లో మరికొందరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిగో అవినీతి అంటూ కరపత్రాలు 

ఆలయ తాజా మాజీ చైర్మన్ గీస భిక్షపతి అవినీతి, అక్రమాలు ఇవేనంటూ 22 అంశాల పాంప్లెంట్స్​  ముద్రించిన గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం కొమరవెల్లిలోని ప్రధాన కూడళ్లలో వదలివెళ్లడం కలకలం సృష్టించింది. ఇవి సోషల్ మీడియాలోనూ వైరల్ గా  మారాయి. అధికార బలంతో భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడాన్ని గాలికి వదిలేసి చైర్మన్​ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ పని చేసింది ఎవరనే దానిపై స్థానికంగా చర్చ నడుస్తోంది.