‘బంగారు మైసమ్మ’ భూములపై కబ్జా రాయుళ్ల కన్ను

‘బంగారు మైసమ్మ’ భూములపై కబ్జా రాయుళ్ల కన్ను

ఆఫీసర్‍ నారాయణపూర్ 139 సర్వే నెంబర్ లో పనులు

అటవీ అధికారులకు భక్తుల ఫిర్యాదు

నారాయణపూర్​ గ్రామ రెవెన్యూ పరిధిలోని బంగారు మైసమ్మ(సందలకుంట్ల) ఆలయ భూములపై కబ్జాకోరుల కన్ను పడింది.  సర్వేనెంబర్​ 139లోని  ఇక్కడి ఆలయ భూమిని కాజేసేందుకు శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు  జేసీబీతో చదువుచేసే ప్రయత్నాలు జరిగాయి. దీనికి గుర్తించిన ఆలయ భక్తులు, గ్రామస్తులు వెంటనే రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఇక్కడి భూములపై న్యాయస్థానాల్లో కేసు నడుస్తుందని, భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి రిటైర్డ్​ సైనికుడిగా గ్రామస్తులు, భక్తులు  చెబుతున్నారు.

వారి వివరాల ప్రకారం 139 సర్వేనెంబర్ లోని ఉన్న ఎన్నో ఏండ్లుగా ఉన్న వృక్షాలను, చెట్లను ఇప్పటికే తొలగించారని, ఎత్తు దిగుళ్లను చదునుచేసే క్రమంలో గతంలో హరితహారంలో తాము నాటిన 300 మొక్కలను కూడా ధ్వంసం చేసినట్లు వారు తెలిపారు. తమ ఫిర్యాదు ఆధారంగా  అటవీశాఖ అధికారులు సంబంధిత బీట్​ ఆఫీసర్​ను పంపించారని, తహసీల్దార్​ చిన్నప్పల నాయకుడు పనులకు ఉపయోగిస్తున్న జేసీబీని పోలీస్​స్టేషన్​కు తరలించాలని వీఆర్​ఏ విష్ణును ఆదేశించారని గ్రామస్తులు వెల్లడించారు.

కేసు కారణంగా సబ్​స్టేషన్​ పనులు సాగలే

సర్వేనెంబర్​139 భూములపై కోర్టులో కేసు ఉంది. ఇక్కడి భూమిలో 2012 సంవత్సరంలో ప్రభుత్వం రూ.కోటి వ్యయంతో  విద్యుత్​ సబ్​స్టేషన్​ నిర్మాణాన్ని తలపెట్టింది. భూ వివాదం కోర్టులో ఉందన్న విషయం తెలిసి ఇప్పటి వరకు పనులు చేయకుండా నిలిపివేశారు. ఇలాంటి భూమిని మళ్లీ కబ్జాదారులబారిన పడకుండా ప్రభుత్వం కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇక్కడి  భూమిని గుడికిచ్చారు

దేవాలయానికి దగ్గర్లో ఉండడంతో 139 సర్వే నెంబర్​లోని కొంత భూమిని దేవాలయంకు ఇచ్చారు.  దాంతో ఈ  స్థలంలో బోరు వేసి, తాగు నీటి తొట్టీల కోసం  షెడ్లను   ఏర్పాటు చేశారు. ఇలాంటి  భూమి అక్రమంగా కబ్జా చేయాలనుకోవడం సరికాదు.  తహసీల్దార్​ ఆదేశాల మేరకు జేసీబీని సీజ్​ చేసి పోలీస్​స్టేషన్​కు తరలిస్తాం.

విష్ణు, వీఆర్​ఏ,

నారాయణపూర్​ గ్రామం

ఎన్నో  ఏండ్ల చెట్లను తొలగించారు

దేవాలయ భూమిని కబ్జా చేసేందుకు  అక్కడి  ఎన్నో ఏండ్ల నాటి చెట్లను నరికేశారు.    ప్రభుత్వం ఒక పక్క హరితహరం పేరుతో లక్షల మొక్కలను దేవాలయ భూముల్లో నాటుతుంటే ఇక్కడ ఇలా జరగడం విచారకరం. అలాంటి దోషులను గుర్తించి ప్రభుత్వం శిక్షించాలి.