
- ఇట్ల మళ్లిస్తే పంచాయతీ రాజ్ వ్యవస్థ మనుగడ కష్టమని ఆవేదన
- కేంద్రానికి పంపిస్తానని గవర్నర్ తమిళిసై హామీ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. గత నెల(డిసెంబరు) 24న రాష్ట్రంలోని జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.3,500 కోట్లు బదిలీ చేసిందన్నారు. ఆ తర్వాతి రోజు క్రిస్మస్ హాలిడే ఉన్నప్పటికీ.. అదే రోజున నిధులను రాష్ట్ర ఖజానాకు దారి మళ్లించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని మంగళవారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసి పంచాయతీ రాజ్ చాంబర్ నేతలు సత్యనారాయణ రెడ్డి, బాదేపల్లి సిద్ధార్థ, శ్రీశైలం, వెంకట్ , అశోక్ రావు వినతిపత్రం అందచేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లించే కార్యక్రమం గతంలో కూడా జరిగిందని, మున్ముందు ఇలాగే జరిగితే పంచాయతీ రాజ్ వ్యవస్థ మనుగడ కష్టమని తెలిపారు.
గతంలో మైనింగ్ సెస్, రిజిస్ట్రేషన్స్టాంప్ డ్యూటీ లోకల్ బాడీలకు వస్తుండగా.. 2018లో తీసుకొచ్చిన కొత్త పంచాయతీ రాజ్ యాక్ట్ లో ఈ నిధులు ప్రభుత్వానికి వచ్చేలా సవరణలు చేశారన్నారు. ఈ వినతిపత్రాన్ని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రికి పంపాలని కోరారు. ఈ అంశంపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని సత్యనారాయణ రెడ్డి చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న గ్రామపంచాయతీల నిధుల మళ్లింపు వ్యవహారంపై తనకు అవగాహన ఉందని, మీడియాలో దీనిపై వచ్చిన కథనాలను చూశానని గవర్నర్ అన్నట్లు ఆయన వెల్లడించారు.