ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

లక్ష కట్టించుకున్నారు.. ఇంకా 70 వేల బిల్లిచ్చారు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని మాతా పిల్లల హాస్పిటల్​లో సరైన బిల్స్​ ఇవ్వకుండా డబ్బులు కట్టించుకుంటున్నారని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందానికి చెందిన సుర్తికర్ సుగుణ, విలాస్ దంపతులు గురువారం కలెక్టర్​ భారతి హోళికేరికి ఫిర్యాఉద చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... గతనెల 25న సుగుణ మంచిర్యాల గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​లో డెలివరీ అయ్యింది. మగబిడ్డ పుట్టాడు. 29న రాత్రి బాబు అస్వస్థతకు గురికాగా డాక్టర్లు కరీంనగర్​ హాస్పిటల్​కు రెఫర్​ చేశారు. వెంటనే ఓ ప్రైవేట్​ అంబులెన్స్​ మాట్లాడుకొని బయల్దేరే సమయానికి అంబులెన్స్​లో ఆక్సిజన్ సరిపడా లేదని, వేరే అంబులెన్స్​లో వెళ్తామంటే అందులోనూ ఆక్సిజన్​ లేదని చెప్పి డ్రైవర్​ వారిని మంచిర్యాలలోని మాతా పిల్లల హాస్పిటల్​లో అడ్మిట్​ చేయించాడు. ఈ నెల 7న బిల్లు కడితే బాబును డిశ్చార్జి చేస్తామని చెప్పి రూ.70 వేల బిల్లు చేతిలో పెట్టారు. ఇప్పటికే మందులు, టెస్టులు అంటూ రూ.లక్ష వసూలు చేశారని, అధిక బిల్లు వేశారనే అనుమానంతో బిల్స్ అడిగితే కంప్యూటర్​ బిల్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. దీంతో వారు గురువారం హాస్పిటల్​ ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన హరీశ్​గౌడ్​ఆధ్వర్యంలో  కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మేకలు, ఎడ్లు, చెవి పోగులు అమ్మి డబ్బులు కట్టామని, దివ్యాంగులమైన తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కలెక్టర్​ జోక్యంతో మిగతా బిల్లు చెల్లించకుండానే బాబును డిశ్చార్జి చేయడంతో దంపతులు ఆమెకు కృతజ్ణతలు తెలిపారు. ఈ విషయమై డాక్టర్​ శ్రీశైలంను వివరణ కోరగా... బాబు కండీషన్​ సీరియస్​గా ఉండడంతో వెంటిలేటర్​పై ఉంచి ట్రీట్​మెంట్​ అందించామని, హాస్పిటల్​లో బోర్డుపై పేర్కొన్న మేరకే బిల్లు వేశామని తెలిపారు. వాళ్ల తరపున ఓ లీడర్​ వచ్చి బిల్లు కట్టకుండానే డిశ్చార్జి చేయాలని బెదిరించాడని, ఆయన సూచనతోనే తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు.

 అంబులెన్స్​ డ్రైవర్లతో కలిసి దోపిడీ....
మంచిర్యాలలోని చాలా హాస్పిటళ్లు అంబులెన్స్​ డ్రైవర్లతో కుమ్మక్కై పేషెంట్లను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఈ కేసులో కూడా అంబులెన్స్​ డ్రైవర్​ ప్లాన్​ ప్రకారం ఆక్సిజన్​ లేదంటూ భయపెట్టి కరీంనగర్​ వెళ్లాల్సిన వాళ్లను మాతా చిల్ర్డన్స్​ హాస్పిటల్​లో చేర్పించినట్టు అర్థమవుతోంది.

నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
నిర్మల్,వెలుగు: వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. గురువారం ఆయన స్థానిక బంగ్​పేట వినాయకసాగర్​ను పరిశీలించారు. చింతకుంటవాడలోని వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కలెక్టర్​ముషారఫ్​అలీ ఫారూఖీతో కలిసి పాల్గొన్నారు. వీరిని సాయిబాబా ఆలయ సింగిల్ ట్రస్టీ లక్కడి జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, అడప పోశెట్టి వినాయక మండప నిర్వాహకులు స్వాగతం పలికారు. భక్తులకు మంత్రి,   కలెక్టర్లు భోజనం వడ్డించారు. అంతకుముందు చైన్ గేట్ నుంచి బంగల్ పేట నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్ ను మోటార్​బైక్​పై తిరిగి చూశారు. మార్గం మధ్యలో  పలువినాయక మండపాల వద్ద మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ తదితరులతో కలిసి పూజలు నిర్వహించారు. ఇప్పటికే అధికారులు నిమజ్జన ఏర్పాట్లు పూర్తిచేసిందన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ మార్గొండ రాము, కౌన్సిలర్లు బిట్లుంగు నవీన్, ఆదుముళ్ల రమాదేవి పద్మాకర్, రాజు, నరేందర్, లక్కాకుల నరహరి, అల్లోల మురళీధర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

పోలీసుల కవాతు..
నిర్మల్ లో శుక్రవారం జరగనున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర  బందోబస్తులో భాగంగా పోలీసులు గురువారం  కవాతు నిర్వహించారు. బుధవార్ పేట మున్నూరు కాపు సంఘం నుంచి ప్రారంభమైన కవాతు జామా మజీద్, చింతకుంటవాడ, కమల్ టాకీస్ చౌరస్తా నుంచి టౌన్ పోలీస్​స్టేషన్​వరకు సాగింది. కార్యక్రమంలో జిల్లా, రామగుండం కమిషనరేట్​పరిధిలోని దాదాపు 300 మంది పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ లక్కిరెడ్డి జీవన్​రెడ్డి మాట్లాడుతూ శోభాయాత్ర  కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణమంతా డ్రోన్​ కెమెరాల నిఘా ఉంటుందన్నారు.

డీజేలకు అనుమతి ఇవ్వాలి
ఆదిలాబాద్/ఆదిలాబాద్​టౌన్, వెలుగు: టీఆర్ఎస్​ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. గురువారం పట్టణంలో గణేశ్​నిమజ్జన శోభాయాత్రకు డీజేకు అనుమతి ఇవ్వాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. ఆదిలాబాద్ పట్టణంలో జరిగే నిమజ్జనం కోసం వివిధ వినాయక మండళ్ల వారు డీజేల కోసం అడ్వాన్స్​లు చెల్లించారని, వారికి నష్టం జరగకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓ వర్గం మెప్పుకోసం ప్రయత్నిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు ఆధినాథ్, లోక ప్రవీణ్ రెడ్డి, దినేశ్​ మాటోలియా, ముకుంద్, దయాకర్, శివ, శ్రీనివాస్, అశోక్ రెడ్డి, విజయ్ పాల్గొన్నారు.

సామూహిక ఉత్సవాలతోనే హిందువుల ఐక్యత
సామూహికంగా ఉత్సవాలు జరుపుకుంటేనే ఐక్యత చాటుకోవచ్చని పాయల్​శంకర్​చెప్పారు. పట్టణంలోని వినాయక మండపాలను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో ముంబై తర్వాత తెలంగాణలోనే ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. నిమజ్జనోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు రత్నాకర్ రెడ్డి, దయాకర్, ముకుంద్ రావు, సిద్దు  పాల్గొన్నారు.

జైళ్లకన్నా అధ్వానంగా వెల్ఫేర్​ హాస్టళ్లు
ఆసిఫాబాద్,వెలుగు: రాష్ట్రంలో వెల్ఫేర్​హాస్టళ్లు జైళ్లకన్నా అధ్వానంగా ఉన్నాయని ఏబీవీపీ రాష్ట్ర కో కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ఆరోపించారు. గురువారం స్థానిక కలెక్టరేట్​ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరాలతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ ​చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలోని వసతి గృహాల్లో కనీస మౌలిక వసతులు లేవన్నారు. ఐదుగురు స్టూడెంట్ల మృతికి ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. నిరసనలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జుమ్మడి అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవి, ఆసిఫాబాద్ నగర కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అవన్నీ ప్రభుత్వ హత్యలే..
తిర్యాణి,వెలుగు: రెసిడెన్షియల్​హాస్టళ్లలోని స్టూడెంట్ల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని తుడుం దెబ్బ డివిజన్​అధ్యక్షుడు వెడ్మ భగవంత రావు పేర్కొన్నారు. గురువారం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో  మండల కేంద్రంలోని కుమ్రంభీం చౌరస్తా ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదంతోనే విద్యార్థులు చనిపోయారని,  సిబ్బందిపై చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డివిజన్ సభ్యులు అర్క మురళి, మండల లీడర్లు మడావి అంబా రావు, ఆత్రం గోపాల్, రవీందర్, కనక హనుమంతరావు తదితరులు ఉన్నారు.

స్టూడెంట్ల చేతిలో గైడ్​లు.. టీచర్లు ఏంచెబుతున్నట్లు?
కాగజ్ నగర్, వెలుగు: స్టూడెంట్లకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పేలేకుంటే టీచర్లు ఏంచేస్తున్నట్లని అడిషనల్​కలెక్టర్ చాహత్​బాజ్​పేయ్​ప్రశ్నించారు. గురువారం కౌటాల హైస్కూల్​ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంటన్నర పాటు అన్ని తరగతులు కలియతిరిగారు. విద్యార్థుల వద్ద గైడ్స్ చూసి ఫైర్​అయ్యారు. సార్లు కొనుక్కోవాలని చెబితే కొనుక్కున్నామని విద్యార్థుల సమాధానం చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే  ఫిజిక్స్ టీచర్ సంతోషి రేఖను పిలిచి నిలదీశారు. మీరు ఉండి ఎందుకని ప్రశ్నించారు.  పిల్లలతో కలిసి క్లాస్​లో కూర్చొని ఫిజిక్స్ టీచర్ సంతోషి రేఖను లెస్సన్​చెప్పాలని ఆదేశించారు. ఆమె పాఠం చెప్పడానికి తడబడడంతో అడిషనల్ కలెక్టర్ మండిపడ్డారు. వెంటనే సదరు టీచర్​కు నోటీసు ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం కేజీబీవీకి వెళ్లి మెడికల్ క్యాంప్ పరిశీలించారు. ఆమె వెంట ఎంఈవో సోమయ్య,  హైస్కూల్ హెచ్ఎం మార్త రమేశ్, ఎస్ వో పవిత్ర తదితరులు ఉన్నారు.

జాతీయ అవార్డు రావాలి
ఆదిలాబాద్, వెలుగు: జాతీయ పంచాయతీ రాజ్ అవార్డు –2023 కోసం అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం జడ్పీ హాల్ లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వివరాలు వచ్చేనెల 31 వరకు ఆన్​లైన్​లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, ట్రెయినీ కలెక్టర్ శ్రీజ, జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో కిషన్, సంక్షేమ అధికారి మిల్కా, డీఎంహెచ్​వో నరేందర్ రాథోడ్, డీఈవో ప్రణతి ఉన్నారు.

పోలీసులకు సహకరించాలి: ఎస్పీ డి.ఉదయ్​కుమార్​రెడ్డి
ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్​లో శుక్రవారం జరగనున్న గణేశ్​ నిమజ్జనోత్సవానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎప్పీ ఉదయ్​కుమార్​రెడ్డి తెలిపారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. గురువారం ఆయన స్థానిక పోలీస్ హెడ్​క్వార్టర్​లో రివ్యూ నిర్వహించారు. సుమారు ఐదు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల వద్ద నిఘా పెంచుతామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా డయల్ 100, లేదా దర్గర్లోని పోలీస్​స్టేషన్​కు సమాచారం ఇవ్వాలన్నారు. అడిషనల్ ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు, డీఎస్పీ వి.ఉమేందర్, సీఐలు పి.సురేందర్, కె. శ్రీధర్, కె.నరేశ్, కె.మల్లేశ్, జె.గుణవంతరావు, పేర్ల గంగాధర్, జె.కృష్ణమూర్తి, ఈ. చంద్రమౌళి  పాల్గొన్నారు.

మూడు నెలల్లోపు ఎస్పీఎం కార్మికులకు న్యాయం
కాగజ్ నగర్,వెలుగు: విధుల్లోకి తీసుకోని 290 మంది ఎస్పీఎం కార్మికుల సమస్య మూడు నెలల్లో పరిష్కారమవుతుందని బీజేపీ లీడర్​హరీశ్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చొరవతో రాష్ట్ర లేబర్ కమిషనర్ మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్పీఎం నెగోషేషన్ కమిటీ అధ్యక్షుడు సూర్య ప్రకాశ్​రావు, షబ్బీర్ హుస్సేన్, కోటి లోకేశ్ సింగ్, భాస్కర్ రెడ్డి, సునీల్ కుమార్, వేణు, వల్లాల వెంకటేశ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికులను వేధిస్తున్న డీవైజీఎం
నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ సీహెచ్​పీలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను డీవైజీఎం వేధిస్తున్నాడని బీఎంఎస్ లీడర్లు ఆరోపించారు. ఉద్యోగులకు సంబంధం లేని పనులు చేయిస్తున్నాడని పేర్కొన్నారు. ఎండా.. వానా,  సౌకర్యాలు  లేకున్నా విధులు నిర్వహించాలని కార్మికులను వేధిస్తున్నారని తెలిపారు. డీవైజీఎం పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేశామని.. చర్యలు తీసుకోకుంటే ఆందోళ కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.