వర్ధన్నపేట హాస్టల్‍ లో భోజనంపై పిల్లల ఆవేదన

వర్ధన్నపేట హాస్టల్‍ లో భోజనంపై పిల్లల ఆవేదన
  • రాత్రి సాంబార్‍ పొద్దున పోస్తున్నరు.. అన్నంలో సోడా కలుపుతున్నరు..
  • వర్ధన్నపేట హాస్టల్‍ లో భోజనంపై పిల్లల ఆవేదన 
  • ఫుడ్​పాయిజన్ తో అస్వస్థతకు గురైన స్టూడెంట్స్​కు కొనసాగుతున్న ట్రీట్​మెంట్​
  • ఎంజీఎం, వర్ధన్నపేట హాస్పిటల్స్​లో చికిత్స  
  •  హాస్టల్ కు వచ్చి పిల్లలను  తీసుకువెళ్లిన తల్లిదండ్రులు 
  •  హాస్టల్‍ ను విజిట్​చేసిన జడ్జి ఉపేందర్‍రావు 
  •  వార్డెన్‍ ను సస్పెండ్​ చేసిన కలెక్టర్‍

వరంగల్‍/ వర్ధన్నపేట/ ఎంజీఎం, వెలుగు: 'హాస్టల్ లో అన్నంలో సోడా కలుపుతున్నరు.  రాత్రి మిగిలిపోయిన సాంబార్‍, పచ్చిపులుసును పొద్దున మసలబెట్టి పోస్తున్నరు. బియ్యం సరిగ్గా కడగట్లేదు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని చెబితే.. బెదిరిస్తున్నరు’ అంటూ వరంగల్‍ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన ఆశ్రమ స్కూల్​ స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి హాస్టల్​లో పెట్టిన అన్నంలో బల్లి వచ్చి ఫుడ్​పాయిజన్​అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వాంతులు, విరేచనాలతో సీరియస్​గా ఉన్న13 మందిని వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్​కు తరలించారు. వీరికి ఎంజీఎం ఆర్థోపెడిక్​స్పెషల్‍ వార్డులో ట్రీట్​మెంట్​ఇస్తున్నారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న 26 మందిని వర్ధన్నపేటలోని దవాఖానాలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అందరూ కోలుకున్నారని డాక్టర్లు చెప్పారు. తరలివచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలు ఎంజీఎంలో చేరారనే  సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం రాత్రే తరలివచ్చారు. మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం ఉదయం వర్ధన్నపేటలోని స్కూల్‍కు వచ్చారు. హాస్పిటల్​బెడ్లపై, స్కూల్​లో దీనంగా ఉన్న తమ పిల్లలను దగ్గరకు తీసుకుని కన్నీరు కార్చారు. ఈ సందర్భంగా తమ తల్లిదండ్రులతో హాస్టల్​లో ఉన్న సమస్యలను చెప్పుకున్న పిల్లలు కూడా బోరుమన్నారు.  

స్కూల్‍ ముందు ఆందోళన..ఉద్రిక్తత

వర్ధన్నపేట గిరిజన హాస్టల్​లోని తమ పిల్లల అవస్థను చూసిన తల్లిదండ్రులు ఆగ్రహంతో స్కూల్‍ ముందు ఆందోళనకు దిగారు. వీరికి వివిధ స్టూడెంట్ యూనియన్లు కూడా తోడయ్యారు. ప్రభుత్వం, అధికారుల తీరును నిరసిస్తూ నినదాలు చేశారు. హాస్టల్‍ గేటు వైపు వచ్చే క్రమంలో పోలీసులకు, తల్లిదండ్రులకు, విద్యార్థి సంఘాల నేతలకు వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా, అక్కడున్న అధికారులు సముదాయించే ప్రయత్నం చేశారు.

ఇక్కడుండొద్దు పోదాం పా బిడ్డా... 

‘పేదోళ్లం కాబట్టి సర్కారు హాస్టల్​లో ఉంచి చదువు చెప్పిస్తే వాళ్ల భవిష్యత్​మంచిగా అవుతుందనుకుంటే ఇలా అవుతుందనుకోలేదు’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘బిడ్డలు ఎన్నోసార్లు ఫోన్​చేసి అన్నం, కూరలు మంచిగ లేవని చెప్తే..సర్దుకు పో బిడ్డా అని చెప్పినం. కానీ ఇప్పుడు అన్నంలో బల్లి వచ్చిందని చెప్తే ఏం కాదు తిను అనాల్నా ? ఇక మా బిడ్డలను చంపుకోలేం. ఉన్నంతలో సాదుకుంటం’ అని హాస్టల్‍ ఖాళీ చేయించి ఇండ్లకు తీసుకుపోయారు. అక్కడున్న కొందరు అధికారులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‍ ఇచ్చే ప్రయత్నం చేసినా లెక్కచేయలేదు.  

హాస్టల్‍ ను విజిట్​చేసిన జడ్జి

హాస్టల్​లోని పిల్లలు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న డిస్ట్రిక్ట్​ లీగల్‍ సెల్‍ అథారిటీ సెక్రెటరీ, సివిల్‍ జడ్జి ఉపేందర్‍రావు మొదట ఎంజీఎం, తర్వాత వర్ధన్నపేట దవాఖానాలో ట్రీట్‍మెంట్‍ తీసుకుంటున్న పిల్లలను పరామర్శించారు. స్కూల్‍, హాస్టల్‍ను విజిట్​చేశారు. వంట గది, బాత్​రూంలు, పిల్లల గదులను పరిశీలించారు. హాస్టల్​లో సమస్యల గురించి అక్కడున్నవారితో మాట్లాడి తెలుసుకున్నారు. 

వార్డెన్‍ సస్పెన్షన్‍

వరంగల్‍ అడిషనల్‍ కలెక్టర్ శ్రీవాస్తవ, ఐటీడీఏ పీఏ అంకిత్, ఫుడ్‍ కంట్రోలర్‍ ఆఫీసర్‍ అమృత శ్రీ హాస్టల్​ను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం, పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టకపోవడం, హాస్టల్​లోని సమస్యలను పరిష్కరించలేదని కలెక్టర్ గోపి వార్డెన్‍ జ్యోతిని సస్పెండ్​చేశారు. టీచర్‍ స్పరూపకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. హాస్టల్​లో పేరుకుపోయిన సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం.. చర్యల పేరుతో వార్డెన్‍ ను సస్పెండ్‍ చేయొద్దని కొందరు విద్యార్థులు ధర్నా చేశారు. విచారణ కోసం వచ్చిన డీటీడీఓ జహిరోద్దీన్‍ ఎదుట నిరసన తెలిపారు.

హాస్టల్​లో శుభ్రత బాగాలేదు. హాస్టల్​లో సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. మంచినీరు బాగాలేదు.దోమలున్నాయ్. శుభ్రత పాటించడం లేదు.  ఇలానే ఉంటే హాస్టళ్లలో జాయిన్‍ కావడానికి పిల్లలు భయపడతారు. ఇక నుంచి మేం రెగ్యులర్​గా హాస్టల్​ను విజిట్​చేస్తాం.

– ఉపేందర్‍రావు, సివిల్​ జడ్జి                   

డిస్ట్రిక్​ లీగల్‍ సెల్‍ అథారిటీ సెక్రెటరీ