కరోనా బాధితులకు ఎంజీఎంలోనే పూర్తి వైద్య సేవలు

కరోనా బాధితులకు ఎంజీఎంలోనే పూర్తి వైద్య సేవలు

వ‌రంగ‌ల్: ఒక్క కరోనా బాధితుడు కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. బుధ‌వారం ఎంజీఎంలో క‌రోనా పేషెంట్స్, సాధార‌ణ పేషెంట్స్ కు అందించాల్సిన వైద్య సేవ‌ల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడారు మంత్రి ఎర్ర‌బెల్లి. అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధుల సూచ‌న‌ల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్న ఆయ‌న‌.. కరోనా బాధితులందరికి ఎంజీఎంలోనే పూర్తి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి జీతాలు పెంచేందుకు జీవో తేవాల‌న్నారు. ఎంజీఎంను పూర్తిగా కోవిడ్ ఆస్పత్రిగా ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామ‌న్నారు. వెంటిలేటర్స్, పీపీఈ కిట్స్ వేట్ట‌నే సమకూర్చాలని అధికారుల‌ను ఆదేశించామన్నారు.

ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింద‌న్నారు. ప్రైవేటు ఆస్పత్రులు, ఎంజీఎం పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నామని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. హోమ్ క్వారెంటైన్ లో చికిత్సపొందే వారికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వైద్యుల వసతి కోసం హరిత కాకతీయ హోటల్ ను కేటాయిస్తున్నామని.. ఆందోళన చెందవద్దన్నారు. హైదరాబాద్ కు పరుగులు పెట్టవద్దని.. ప్రైవేటు డాక్ట‌ర్ల‌ సేవలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంజీఎంలో తక్షణమే వెంటిలేటర్లు సమకూర్చాలని సర్కార్ నుండి ఆదేశాలు వ‌చ్చాయ‌ని…ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామ‌ని తెలిపారు మంత్రి ద‌యాక‌ర్ రావు.