వరాహ రూపంలో భద్రాద్రి రామయ్య

వరాహ రూపంలో భద్రాద్రి రామయ్య
  •     మంగళ నీరాజనాలతో 
  • మొక్కులు చెల్లించుకున్న భక్తులు

భద్రాచలం, వెలుగు: శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా పగల్​పత్​ఉత్సవాల్లో సోమవారం భద్రాద్రిలో శ్రీసీతారామచంద్రస్వామి వరాహ రూపంలో దర్శనమివ్వగా భక్తులు తిలకించి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా గర్భగుడిలో మూలవరులకు ప్రత్యేక పూజలు చేసి, ముత్యాలు పొదిగిన వస్త్రాలను అలంకరించి ముత్తంగిసేవను నిర్వహించారు. 

ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై సేవాకాలం నిర్వహించిన తర్వాత సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను వరాహరూపంలో అలంకరించారు.  ఈ అవతారాన్ని రాహుగ్రహ బాధలున్నవారు దర్శించడం వల్ల విముక్తులవుతారనేది భక్తుల విశ్వాసం. ప్రాకార మండపంలో వరాహ రామయ్యకు అధ్యయనోత్సవంలో భాగంగా చతుర్వేద, రామాయణ ఇతిహాసాలు, పురాణం, భద్రాద్రిక్షేత్ర మహత్యం పారాయణాలు చేశారు.  

కోలాటాలు, రామనామ స్మరణలు, భజనలతో ఊరేగింపుగా వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై వరాహ రామయ్యను అధిష్టించారు. అక్కడ పూజలందుకున్న స్వామి తాతగుడి సెంటర్​లోని గోవిందరాజస్వామి ఆలయానికి తిరువీధి సేవగా వెళ్లారు. మార్గ మధ్యలో స్వామికి మహిళలు పెద్ద ఎత్తున మంగళ నీరాజనాలు పలికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరిగి ఆలయానికి స్వామి రాత్రి చేరుకున్నారు. ఈ వేడుకల్లో ఈవో దామోదర్​రావు పాల్గొన్నారు.