కూలి పని కోసం వస్తూ.. బొలెరో, లారీ ఢీకొని ముగ్గురు మృతి

కూలి పని కోసం వస్తూ.. బొలెరో, లారీ ఢీకొని ముగ్గురు మృతి
  • మరో ఐదుగురికి గాయాలు
  • మంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్‌‌రోడ్డు వద్ద ప్రమాదం
  • బాధితులంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్‌‌ జిల్లాకు చెందిన వారే..

జైపూర్, వెలుగు : రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరోను లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మహిళా కూలీలు చనిపోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం ఎక్స్‌‌రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్ర చంద్రాపూర్‌‌ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది కూలీలు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌‌లో వ్యవసాయ పనులు చేసేందుకు వస్తున్నారు. ఆదివారం రాత్రి బొలెరోలో బయలుదేరిన వారు సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు మంచిర్యాల జిల్లా జైపూర్‌‌ ఎక్స్‌‌ రోడ్డు సమీపంలోకి చేరుకొని.. రోడ్డు పక్కన వాహనాన్ని ఆపారు. ఇదే టైంలో శ్రీరాంపూర్‌‌ వైపు నుంచి వచ్చిన లారీ ఆగి ఉన్న బొలెరోను ఢీకొట్టింది. 

ప్రమాదంలో డోగిరి గ్రామానికి చెందిన మండరి నీలాబాయి (65), భీంవాడ్‌‌ గ్రామానికి చెందిన సాయం ఇమ్లిబాయి (45), చండ్లిభోజ్‌‌ గ్రామానికి చెందిన మీనా లాటిల్‌‌వార్‌‌ (45) చనిపోగా.. మరో ఐదుగురికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రమాద స్థలాన్ని డీసీపీ భాస్కర్‌‌, జైపూర్‌‌ ఏసీపీ వెంకటేశ్వర్‌‌, సీఐ నవీన్‌‌కుమార్‌‌ 
పరిశీలించారు.

ట్రాక్టర్‌‌ను ఢీకొట్టిన బైక్‌‌.. ఇద్దరు మృతి

మెదక్ టౌన్, వెలుగు : ట్రాక్టర్‌‌ను వెనుక నుంచి బైక్‌‌ ఢీకొట్టడంతో ఇద్దరు చనిపోయారు. ఈ ప్రమాదం మెదక్‌‌ జిల్లా హవేలీ ఘన్‌‌పూర్‌‌ పరిధిలోని శాలిపేట గేటు వద్ద సోమవారం రాత్రి జరిగింది. బూర్గుపల్లి గ్రామానికి చెందిన దాసరి సుమన్‌‌ (20), గుండాల బాలయ్య (22), అరికెల కుమార్‌‌ కలిసి బైక్‌‌పై... హవేలీ ఘనపూర్‌‌ నుంచి బూర్గుపల్లికి వెళ్తున్నారు. శాలిపేట గేటు వద్దకు రాగానే.. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌‌ను ఢీకొట్టారు. దీంతో సుమన్‌‌ అక్కడికక్కడే చనిపోగా.. మిగతా ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానికులు 108లో మెదక్‌‌ జిల్లా జనరల్‌‌ హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ బాలయ్య చనిపోగా.. కుమార్‌‌ పరిస్థితి విషమంగా ఉంది.