వెలుగు, నెట్వర్క్: పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ప్రమాణస్వీకారం సోమవారం అట్టహాసంగా జరిగింది. పంచాయతీలకు బాధ్యతలు అప్పగించిన అధికారులు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని, అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. పల్లెల అభివృద్ధికి సర్పంచులంతా తోడ్పడాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. నిర్మల్ మండలం అనంతపేటతో పాటు మరికొన్ని గ్రామపంచాయతీల్లో జరిగిన సర్పంచ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ప్రజల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి నిరంతరం శ్రమించాలని సూచించారు. ఖానాపూర్ మండలం మస్కాపూర్, తర్ల పాడ్, జన్నారం మండలం పొనకల్, కలమడుగు, పొనకల్, రేండ్లగూడతోపాటు ఉట్నూరు మండలం ఘన్‌పూర్‌లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ హాజరై సర్పంచ్ఆనంద్రావు, ఉప సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. ఖానాపూర్ నియోజకవర్గం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీల్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు హాజరయ్యారు.
