మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం మధ్యాహ్నంలోపే తెలియనున్నాయి. ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తయ్యేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. వార్డుల వారీగా ఫలితాలను సాధ్యమైనంత త్వరగా అందించేలా ఓట్ల లెక్కింపునకు టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. 24 వార్డులు అంతకంటే ఎక్కువ ఉన్న దగ్గర వార్డుకు ఒక ఓట్ల లెక్కింపు టేబుల్‌ ఉంటుంది. తక్కువ వార్డులున్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు టేబుళ్లు…పోలైన ఓట్ల ఆధారంగా ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలలోపే ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు జరిగిన 120 మున్సిపాలిటీలు ,9 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు రేపు(శనివారం) జరగనుంది. ఏకగ్రీవమైనవి కాకుండా మున్సిపాలిటీల్లోని 2,647 వార్డులు, కార్పొరేషన్లలోని 324 డివిజన్ల ఓట్ల లెక్కింపు ఉంటుంది. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు జరిగడంతో ఎలాంటి వివాదాలు, గందరగోళానికి తావులేకుండా ఓట్ల లెక్కింపు ఉండాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఎన్నికల పరిశీలకులకు స్పష్టం చేసింది.

కౌంటింగ్ ఏర్పాట్లు..

…సగటున 1,200 ఓట్లు పోలై ఉంటే లెక్కింపునకు మూడు గంటల సమయం తీసుకుంటుందని అంచనా వేశారు. అంతకంటే తక్కువ ఓట్లున్న దగ్గర గంట, రెండు గంటల్లోనే లెక్కింపు పూర్తవుతుంది.

…ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి గంట కౌంటింగ్‌ ముందస్తు ప్రక్రియకు తీసుకుంటుంది. తొమ్మిది గంటలకు లెక్కింపు మొదలవుతుంది.

…మున్సిపాలిటీల్లో సగటున ప్రతి వార్డుకు రెండు పోలింగ్‌ సెంటర్లు  ఉండటంతో ఓట్ల లెక్కింపు సరి చూసుకుని ఆ వార్డుకు సంబంధించిన పోలింగ్‌ కేంద్రాల ఓట్లను కలుపుతారు. బండిళ్లుగా కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా పోస్టల్‌ ఓట్లను లెక్కిస్తారు.

…ఓట్ల లెక్కింపు టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ ఏజెంట్లు ఉంటారు. ప్రతి మూడు టేబుళ్లకు ఒక రిటర్నింగ్‌ అధికారి, సహాయ రిటర్నింగ్‌ అధికారి పర్యవేక్షిస్తారు. వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.