కొండా దుమారం

కొండా దుమారం
  • నూలు దండపై బీఆర్ఎస్ ​ట్రోలింగ్​తో రాజుకున్న చిచ్చు
  • దొంగ ఏడుపు అన్న కేటీఆర్ కామెంట్ల​పై కొండా సురేఖ ఫైర్​
  • నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణం
  • చాలా మంది హీరోయిన్ల  ఫోన్లను ట్యాప్ చేసిండు
  • హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు
  • కేటీఆర్​ బాధకే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్లిపోయారని కామెంట్​
  • మంత్రి వ్యాఖ్యలతో రాజకీయ,  సినీ వర్గాల్లో కలకలం

హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ లక్ష్యంగా బీఆర్ఎస్​ శ్రేణులు నూలుదండపై చేసిన ట్రోలింగ్స్ వ్యవహారం చినికిచినికి గాలివానలా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై తాజాగా సురేఖ చేసిన కామెంట్స్​అటు రాజకీయ, ఇటు సినీవర్గాల్లో దుమారం రేపాయి. ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘునందన్​రావు  చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలు దండ వేస్తే.. ఆ ఫొటో కింద  నీచమైన కామెంట్లు పెట్టి సోషల్​మీడియాలో ట్రోల్​ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మంగళవారం గాంధీభవన్​లో కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్​ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా.. ‘ఆమెవి దొంగ ఏడుపులు.. ఆ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకో అర్థం కాలేదు’ అంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలిసిన సురేఖ ఫైర్ ​అయ్యారు.గాంధీ భవన్​లో పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సురేఖ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

కేటీఆర్​వల్లే వాళ్లు విడాకులు తీసుకున్నరు..

దొంగ ఏడుపులు తనకు అవసరం లేదని, నీకు తల్లి లేదా? అని కేటీఆర్ ను సురేఖ ప్రశ్నించారు. హీరో నాగచైతన్య, సమంత దంపతుల విడాకులకు  కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించారు. హీరోయిన్ లకు డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్ అని అన్నారు. ఆయన బాధకు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకున్నారని చెప్పారు. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపించారు. సినీ ఇండస్ట్రీ  నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్లిపోవడానికి కూడా కేటీఆరే కారణమని అన్నారు.

చాలామంది హీరోయిన్ల ఫోన్లను కూడా కేటీఆర్ ట్యాప్ చేశారని చెప్పారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు సిగ్గు లేకుండా తనపై విమర్శలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో దుబాయ్ వేదికగా 3 అకౌంట్ల నుంచి పోస్టులు పెడుతున్నారని, అయినా వాటిపై కేటీఆర్​ ఎందుకు స్పందించడంలేదని మండిపడ్డారు. నువ్వు మనిషివి కాదా? పశువువా? అంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల మధ్య అనుబంధాలు, విలువల గురించి కేటీఆర్ కు ఏం తెలుసని ప్రశ్నించారు. ఇంతకుముందు గిరిజన మహిళా మంత్రి అయిన సీతక్కపై, మేయర్ విజయలక్ష్మిపై  కూడా అసభ్యకర పోస్టులు పెట్టారని తెలిపారు. తాను ఐదేండ్లు బీఆర్ఎస్ లో పని చేశానని, తన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసని అన్నారు.

‘‘మేం దిగజారి ప్రవర్తిస్తే...కేటీఆర్ భార్య, కవిత ఫొటోలు కూడా మార్ఫింగ్ చేయలేమా? కానీ.. మాకు సంస్కారం ఉంది. అందుకే మేం అలా చేయడంలేదు. అలా చేస్తే బీఆర్ఎస్ నేతల పరువు ఎక్కడుంటుంది?” అని ప్రశ్నించారు.  తాను అనలేని మాటలను కూడా అన్నట్టు కేటీఆర్ చెబుతున్నారని, అబద్ధాల్లో ఆయనకు మించిన వాళ్లు లేరని ఎద్దేవా చేశారు.  కేటీఆర్ తనపై ఆరోపిస్తున్నట్టుగా తాను ఏనాడు అంత అసహ్యంగా మాట్లాడలేదని, అలాంటి మాటలు ఏమైనా ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గాలి మాటలు మాట్లాడడం బంద్ చేయాలని కేటీఆర్కు హితవు పలికారు. 

మహిళలను ఎదగనివ్వరు

బీఆర్ఎస్​లో తాను, బొడిగె శోభ, రేఖా నాయక్  ముగ్గు రం మహిళా ఎమ్మెల్యేలుగా ఉన్నా మంత్రి పదవులు ఇవ్వలేదని కొండా సురేఖ ఆరోపించారు. బీఆర్ఎస్​లో మహిళలను ఎదగనివ్వరని అన్నారు. కుటుంబ పాలనే సాగాలని తమకు పదవులు ఇవ్వలేదని చెప్పారు. తనపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్​లను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్నదని తెలిపారు. తాము బీఆర్ఎస్ నేతల లాగా సోషల్ మీడియాను దుర్వినియోగం చేయబోమని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు హైడ్రాపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. మూసీ బాధితులందరినీ గుర్తించి, ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే మూసీ నిర్వాసితులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అన్ని వసతులు కల్పించినచోటుకే నిర్వాసితులను తరలిస్తామన్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలు.. ఇలా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగనీయబోమని చెప్పారు.

ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దు: అక్కినేని అమల

ఓ మహిళా మంత్రి ఏదేదో ఊహించుకుని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదని అక్కినేని అమల ఫైర్ అయ్యారు. సమాజంలో పరువు ఉన్న తమలాంటి వ్యక్తులను రాజకీయ అవసరాలకు వాడుకోవడం తనను షాక్​కు గురి చేసిందని అన్నారు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లపై ఆమె తీవ్రంగా స్పందించారు. ‘‘కొంచెమైనా సిగ్గు లేకుండా నా భర్తపై ఎవరో ఏవో చెప్పిన కట్టుకథలను మీరు నమ్ముతున్నారా? ఇది అత్యంత సిగ్గుచేటు. రాజకీయ నేతలంతా ఇలా నేరస్తుల్లా ప్రవర్తిస్తే దేశం ఏమైపోతుంది? రాహుల్ గాంధీ నిజంగా ఎదుటివాళ్ల పరువు గురించి ఆలోచించే వాళ్లే అయితే.. మీ నేతలను ఇలాంటి కామెంట్లు చేయకుండా అడ్డుకోండి. వెంటనే ఆమెతో బహిరంగ క్షమాపణలు చెప్పించి ఆ మాటలను వెనక్కి తీసుకోమనండి. ఈ దేశపౌరులను కాపాడండి’’ అని అమల డిమాండ్ చేశారు.

సినిమాల్లోని ఆడవాళ్లపై అంత చిన్నచూపా?: ప్రకాశ్​రాజ్​

నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమని, కొంతమంది హీరోయిన్లకు డ్రగ్స్​ అలవాటు చేశాడంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాశ్​రాజ్​ స్పందించారు. బుధవారం ఆయన ట్విట్టర్ (ఎక్స్​) వేదికగా సురేఖనుద్దేశించి పోస్ట్​ పెట్టారు. ‘‘ఏంటీ సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా?” అని వ్యాఖ్యానించారు.