పోలీసులు కేసు దర్యాప్తు చేస్తలేరని.. మృతుని బంధువులు

పోలీసులు కేసు దర్యాప్తు చేస్తలేరని.. మృతుని బంధువులు

కేసు దర్యాప్తు చేస్తలేరని స్టేషన్ ​ఎదుట ఆందోళన

కారేపల్లి, వెలుగు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెంది నెలలు గడుస్తున్నా పోలీసులు దర్యాప్తు చేయకుండా కాలయాపన చేస్తున్నారంటూ కుటుంబీకులు, గ్రామస్థులు పోలీస్​స్టేషన్​ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో జరిగింది. కారేపల్లి మండల పరిధిలోని గేటురేలకాయలపల్లి గ్రామానికి చెందిన ధరంసోత్​ సుదర్శన్(24)​ ఆగస్టు 3న ప్రేమ వ్యవహారంలో అనుమానాస్పదంగా చనిపోయాడు. మృతికి కారకులన్న అనుమానంతో అదే గ్రామానికి చెందిన ఆరుగురిపై కుటుంబీకులు కారేపల్లి ఎస్సై పొదిలి వెంకన్నకు ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించి  నెలలు గడుస్తున్నా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మంగళవారం గేటురేలకాయలపల్లి గ్రామస్థులు వందల సంఖ్యలో పోలీస్​స్టేషన్​కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎర్రబోడు వద్ద వారి వెహికల్స్​ను అడ్డుకున్నారు. దీంతో కాలినడకన సుమారు 10 కిలోమీటర్లు ప్రయాణించి గ్రామస్థులు కారేపల్లి చేరుకున్నారు. న్యాయం చేయాలంటూ పోలీస్​స్టేషన్​ ముందు ఆందోళనకు దిగారు. మృతుడి తండ్రి రాంబాబు, బాబాయి కోటేష్​ ఒంటిపై డీజీల్​ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. చుట్టుపక్కలవారు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఏసీపీ వెంకట్​రెడ్డి మృతుడి కుటుంబీకులతో మాట్లాడారు. అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో కేసును నీరుగారుస్తున్నారని కుటుంబీకులు ఆరోపించారు. సీఐ శ్రీనివాసులు, ఎస్సై వెంకన్న అనుమానితులకు సహకరిస్తున్నారని ఏసీపీకు ఫిర్యాదు చేశారు. 15 రోజుల్లోగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ చెప్పారు.

For More News..

తండ్రి పురుగుల మందు తాగించినా.. కవలలు బతికిన్రు

సస్పెన్షన్​ ఎత్తేసే వరకూ బాయ్‌కాట్