పరిహారం లేకుండానే.. హైవే 163 పనులు

పరిహారం లేకుండానే.. హైవే 163 పనులు
  •     ఎన్​హెచ్​ 163 బాధిత రైతుల ఆందోళన 
  •       2013 చట్ట ప్రకారమే  పరిహారం ఉంటుందటున్న అధికారులు  
  •     ప్రజాభిప్రాయం లేకుండా.. మీటింగ్​లతోనే సరి.
  •     మార్కెట్​ ధరతో పరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు.. 

పెద్దపల్లి, వెలుగు : నేషనల్​ హైవే 163 వివాదం మరోసారి తెరమీదికొచ్చింది. రెండేళ్లుగా హైవే నిర్మాణం కోసం ఆఫీసర్లు సర్వేలు నిర్వహించి, 2013 యాక్ట్​ ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. రైతులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. గత సర్కార్​ తీసుకున్న నిర్ణయాన్ని , కాంగ్రెస్​ సర్కార్​ పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు.   రెండు రోజుల క్రితం ముత్తారం గ్రామపంచాయతీ వద్దకు రైతులను పిలిపించి, హైవే కోసం భూములను ప్రభుత్వం తీసుకుంటున్నదని అధికారులు తెలిపారు, గతంలో నిర్ణయించిన ప్రకారమే పరిహారం ఉంటుందని  చెప్పడంతో ఆగ్రహించిన రైతులు భూములిచ్చేది లేదని అధికారుల ముఖం మీదనే చెప్పారు. దానికి ఆఫీసర్లు పరిహారం నచ్చకపోతే కోర్టులకు వెళ్లండని చెప్పి వెళ్లిపోయారు. 

ఇప్పటికే నేషనల్​ హైవే కింద భూములు పోతున్న పలు గ్రామాలు కోర్టును ఆశ్రయించాయి. కానీ ఫలితం కనిపించడం లేదు. ఎలాంటి పబ్లిక్​ హియరింగ్​ లేకుండానే భూములను తీసుకోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నేషనల్​ హైవే కింద పోయేవన్నీ రెండు పంటలు పండే భూములని, ఎకరానికి మార్కెట్​ ధర దాదాపు రూ. 40 లక్షల వరకు పలుకుతోంది, అలాంటి భూములకు సర్కార్​ ఎకరానికి రూ. 7 నుంచి 8 లక్షల వరకు ఇచ్చి భూములను తీసుకోవడానికి సిద్దమైంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. భూములు ఇవ్వడానికి రైతులు సిద్దంగా ఉన్నా పరిహారం విషయంలో సర్కార్​ మొండి వైఖరి చూపుతోందన రైతులు చెప్తున్నారు. 

 ప్రజాభిప్రాయం లేకుండానే.. 

రోడ్డు నిర్మాణం కోసం భూముల సేకరించాల్సినప్పుడు అధికారులు సంబంధిత రైతుల నుంచి ప్రజాభిప్రాయసేకరణ చేయాలి. కానీ ఎన్​హెచ్​ 163 కి సంబంధించి అలాంటిది ఏమీ జరుగలేదని రైతులు చెప్తున్నారు. ఒకటి రెండు సార్లు మీటింగులు పెట్టినా అధికారులు చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోతున్నారు. 2013 చట్టం ప్రకారం పరిహారం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ రైతులు ఆ చట్టం ప్రకారం భూముల ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మార్కెట్​ రేట్​ దాదాపు రూ. 40 లక్షల వరకు ఎకరం పలుకుతోదని, ఆ ధరకైతే భూములు ఇస్తామని రైతులు అంటున్నారు. 

అధికారులు మాత్రం ఎన్​హెచ్​ పనులు వేగవంతం చేయడానికి సిద్దపడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మీదుగా జయశంకర్​ భూపాలపల్లి నుంచి రంగారెడ్డి జిల్లా వరకు ఈ హైవే నిర్మాణం జరుగనుంది, దీని కోసం పెద్దపల్లి జిల్లాలో 38. 07 కిలోమీటర్ల మేర మంథని, రామగిరి, ముత్తారం మండలాల్లో 16 గ్రామాల పరిధిలో 493 ఎకరాల భూసేకరణ చేస్తున్నారు. దాని కోసం భూసేకరణ చేసి పరిహారాన్ని లాండ్​ అధారిటీలో జమచేస్తామని, ఏమైనా ఆబ్జక్షన్స్​ ఉంటే కోర్టుల్లో తేల్చకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు ధరణి ఎఫెక్ట్​...

నేషనల్​ హైవేలో భూములు కోల్పోతున్న కొందరు రైతులకు ధరణితో నష్టపోతున్నారు. ధరణిలో ఉన్నవారి భూములకే పరిహారం ఇస్తామని ఆనాటి సర్కార్​ చెప్పింది. నేషనల్​ హైవేలో పోతున్న భూముల్లో దాదాపు 200 ఎకరాలు, భూయజమానుల పేర్లు ధరణిలో లేవు. సాగులో ఉన్న ప్రతి ఒక్కరికీ మార్కెట్​వాల్యూ ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. 

పరిహారంపై కొత్త సర్కార్​ ఆలోచించాలి

నేషనల్​ హైవేలో పోతున్న భూముల విషయంలో కాంగ్రెస్​ సర్కార్ పునరాలోచించాలి. కోట్ల విలువ చేసే పంట భూములను ఇస్తే రైతులు రోడ్ల పాలవుతాం. ఎకరానికి రూ. 40 లక్షలు, లేదా ఎకరం భూమికి మూడెకరాలు భూమి ఇచ్చినట్లయితే భూముల ఇస్తాం.

 - నూనేటి కృష్ణ, రైతు, ముత్తారం

చట్ట ప్రకారం భూసేకరణ చేస్తాం

2013   చట్టం ప్రకారం నేషనల్​ హైవే కోసం భూసేకరణ చేస్తున్నాం. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులతో మాట్లాడుతున్నాం. కొంత మంది రైతులు పరిహారం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కోర్టు పరిధిలో పరిష్కరించుకోవాలి. - .

హనుమానాయక్​, ఆర్డీఓ, మంథని, పెద్దపల్లి