రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ముందు ఆందోళనలు

రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ముందు ఆందోళనలు

రాష్ట్రంలో వరుసగా రెండో రోజు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కష్టాలు కొనసాగుతున్నాయి. సర్వర్లు మొరాయిస్తున్నాయి. స్లాట్ల బుకింగ్ లోనూ సమస్యలు ఎదురౌతున్నాయి. పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలంటూ ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ముందు తెలంగాణ డాక్యమెంట్ రైటర్స్ ఫెడరేషన్ ధర్నా నిర్వహించింది. ప్రభుత్వం మొండి వైఖరి విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు డాక్యమెంట్ రైటర్లు. ధరణి వద్దు… కార్డు ముద్దు  అని నినాదాలు చేశారు.

హైదరాబాద్ హయత్ నగర్ లో విజయవాడ జాతీయ రహదారిపై స్థానికులతో కలిసి రాస్తారోకో చేశారు బీజేపీ, టీడీపీ నేతలు. పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. నేతల రాస్తారోకోతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిరసన తెలిపారు. హన్మకొండలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరి ఫాతిమా జంక్షన్ లో రాస్తారోకో చేశారు రియల్టర్లు. LRS రద్దు చేసి, పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  రియల్టర్లు, బిల్డర్లు, డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేశారు. కొత్త విధానంలో ఇబ్బందులు పడ్తున్నామన్నారు రియల్టర్లు, బిల్డర్లు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్ఎఆర్ఎస్, ధరణి రద్దు చేయాలంటూ ఖమ్మంలో సబ్ రిజిస్ట్రార్  ఆఫీసు ముందు ధర్నా చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల పాత మున్సిపల్ ఆఫీసు ముందు బీజేపీ కౌన్సిలర్ మడవేణి నరేశ్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.