యాసంగిలోనూ షరతుల సాగే

యాసంగిలోనూ షరతుల సాగే

ప్లాన్స్ రెడీ చేస్తున్న వ్యవసాయ శాఖ

మొక్కజొన్నకు గ్రీన్ సిగ్నల్..!

హైదరాబాద్, వెలుగు: వానాకాలంలో నియంత్రిత సాగు అమలు చేసిన వ్యవసాయ శాఖ యాసంగిలోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, సాగు విస్తీర్ణం అంచనాలను రూపొందిస్తున్నారు. గత యాసంగిలో 53. 82 లక్షల ఎకరాలలో సాగు చేయగా ఈసారి 10 నుంచి15 లక్షలకు పెరుగుతుందని చెబుతున్నారు.

మొక్కజొన్నకు గ్రీన్ సిగ్నల్!

యాసంగిలో ఏ పంట ఎంత వేయాలన్న కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. వరి పంట 45 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఎరువులు, విత్తనాల కోసం ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈసారి 8 లక్షల ఎకరాల వరకు సాగు చేయించే చాన్స్ ఉంది.  వరి కాకుండా యాసంగిలో వేరుశనగ(పల్లీ), పప్పుశనగ(బెంగాల్ గ్రామ్) పంటల సాగు ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ పంటలను పండించేలా రైతులను ప్రోత్సహిస్తే లాభాలు వచ్చే చాన్స్ ఉందని అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

విత్తనాలు సిద్ధం

వేరుశనగ పంటకు 3. 09 లక్షల క్వింటాళ్లు, పప్పు శనగకు 2. 34 లక్షల క్వింటాళ్ల విత్తనాలను  సిద్ధం చేశారు. మిగతా పంటలకు 15. 56 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేసినా దాదాపు 20 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, హాకాతో  పాటు ప్రైవేట్ కంపెనీలు , అగ్రికల్చర్ యూనివర్సిటీ యాసంగి కోసం విత్తనాల విక్రయించనున్నాయి.  ఈ సారి యాసంగికి18.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది. 10 లక్షల టన్నుల యూరియా, 1.2 లక్షల  టన్నుల డీఏపీ, 1.1 లక్షల టన్నుల పొటాష్, 50 వేల టన్నుల సూపర్ పాస్ఫేట్, 5. 5 లక్షల  టన్నుల కాంప్లెక్స్ ఎరువులను ఇవ్వనుంది. గతేడాది కన్నా 2 లక్షల టన్నుల యూరియా ఎక్కువగా ఇచ్చింది. మరో లక్ష టన్నుల యూరియా కావాలని వ్యవసాయ శాఖ కోరుతోంది.