కరప్షన్ కండక్టర్.. మగవాళ్లకు జీరో టికెట్.. టికెట్‌‌ చెకింగ్‌‌ ఇన్స్‌‌పెక్టర్‌‌పై కండక్టర్‌‌ దాడి

కరప్షన్ కండక్టర్.. మగవాళ్లకు జీరో టికెట్.. టికెట్‌‌ చెకింగ్‌‌ ఇన్స్‌‌పెక్టర్‌‌పై కండక్టర్‌‌ దాడి
  • మగవారికి జీరో టికెట్‌‌ ఇచ్చి డబ్బులు తీసుకున్న కండక్టర్‌‌
  • ఆఫీసర్లు పట్టుకొని, మెమో జారీ చేయడంతో 
  • లంచం అడిగారంటూ ఆరోపణలు
  • సంగారెడ్డి జిల్లా  రాయికోడ్‌‌లో ఘటన

సంగారెడ్డి/రాయికోడ్, వెలుగు : బస్‌‌లో టికెట్‌‌ చెకింగ్‌‌ కోసం వచ్చిన ఆఫీసర్లపై ఓ కండక్టర్‌‌ చెప్పుతో దాడి చేయడమే కాకుండా.. లంచం డిమాండ్‌‌ చేశారని ఆరోపిస్తూ ప్రయాణికులతో సైతం దాడి చేయించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌‌లో శుక్రవారం జరిగింది. పోలీసులు, ఆర్టీసీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... నారాయణఖేడ్‌‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం హైదరాబాద్ నుంచి రాయికోడ్‌‌ మీదుగా నారాయణఖేడ్‌‌ వెళ్తోంది. మార్గమధ్యలోని కప్పాడ వద్దకు రాగానే టికెట్‌‌ చెకింగ్‌‌ ఆఫీసర్లు పెడ్డదొడ్డి యేసయ్య, ఇన్‌‌చార్జి టీటీఐ వి.ప్రకాశ్‌‌ బస్సు ఆపి తనిఖీ చేశారు. 

ఈ క్రమంలో మునిపల్లి మండలం చెల్మెడ నుంచి కప్పాడ వరకు ప్రయాణించిన ఓ వ్యక్తి వద్ద కండక్టర్‌‌ వసంత్‌‌ రూ. 20 తీసుకొని, మహిళలకు ఇవ్వాల్సిన జీరో టికెట్‌‌ ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో కండక్టర్‌‌కు వసంత్‌‌కు మెమో జారీ చేయగా.. అందులో సంతకం చేసేందుకు అతడు నిరాకరించాడు. పైగా ఆఫీసర్లు రూ. 20 వేలు లంచం అడిగారని ప్రయాణికులకు చెప్పడంతో వారంతా టికెట్‌‌ చెకింగ్‌‌ ఆఫీసర్లతో గొడవకు దిగారు. బస్సు రాయికోడ్‌‌ బస్టాండ్‌‌కు చేరుకోగానే కండక్టర్‌‌ వసంత్‌‌ చెకింగ్‌‌ ఆఫీసర్లపై చెప్పుతో దాడి చేశాడు. చార్జి మెమోతో పాటు ఎంటీడీ 353 రికార్డులను లాక్కున్నాడు. ఈ దాడిలో ఇద్దరు చెకింగ్‌‌ ఆఫీసర్లకు గాయాలయ్యాయి. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కండక్టర్‌‌ వసంత్‌‌తో పాటు దాడిలో పాల్గొన్న ప్రయాణికులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.