
- పుణెలో లోక్ మాన్య తిలక్ అవార్డును అందుకున్న మోదీ
- బహుమతిగా వచ్చిన రూ.లక్ష.. నమామి గంగేకు విరాళం
పుణె/ముంబై: ప్రభుత్వ పాలసీలు, ప్రజల హార్డ్ వర్క్‌పై నమ్మకం పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అపనమ్మకం ఉన్న చోట అభివృద్ధి అసాధ్యమని చెప్పారు. మంగళవారం పుణెలో జరిగిన కార్యక్రమంలో లోక్ మాన్య తిలక్ నేషనల్ అవార్డును మోదీ అందుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ట్రస్ట్ డెఫిసిట్ నుంచి ట్రస్ట్ సర్‌ప్లస్’ వరకు ఇండియా జర్నీని వివరించారు. ‘‘తమ ప్రభుత్వాన్ని ఎక్కువ మంది ప్రజలు నమ్మే దేశం ఇండియానే అని అంతర్జాతీయ స్థాయిలో చేసిన సర్వేలో తేలింది.
గత 9 ఏండ్లలో దేశ ప్రజలు ఎన్నో మార్పులు సాధ్యమయ్యేలా చేశారు. దేశాన్ని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఎకానమీగా చేశారు” అని అన్నారు. లోక్‌మాన్య తిలక్ నేషనల్ అవార్డు ద్వారా తనకు వచ్చిన రూ.లక్షను నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
స్వాతంత్ర్య పోరాట గమనాన్నే తిలక్ మార్చేశారు
పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యాన్ని లోక్‌మాన్య తిలక్ అర్థం చేసుకున్నారని, స్వాతంత్ర్య పోరాట గమనాన్నే మార్చివేశారని మోదీ చెప్పారు. ‘‘తిలక్ జీవితం నుంచి పలు విషయాలను నేర్చుకోవచ్చు. భగవద్గీతపై ఆయనకు ఎంతో విశ్వాసం. బ్రిటీషర్లు తిలక్‌ను జైలుకు తరలిస్తే.. అక్కడ కూడా భగవద్గీతపై ఆయన తన రీసెర్చ్ కొనసాగించారు. ప్రజలు తమను తాము నమ్మేలా చేశారు. భారతదేశపు బానిసత్వ శృంఖలాలను బద్దలు కొట్టడం అసాధ్యమని ప్రజలు నిరుత్సాపడినప్పుడు.. స్వేచ్ఛపై నమ్మకం కల్పించారు” అని మోదీ వివరించారు.
అవిశ్వాసం ఉన్న వాతావరణంలో దేశ అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని అన్నారు. ‘‘నిన్న (సోమవారం) మనోజ్ పోచట్ అనే వ్యక్తి నుంచి నాకు ఓ ట్వీట్ వచ్చింది. పదేండ్ల కిందట నేను పుణెలో పర్యటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ట్రస్ట్ డెఫిసిట్’ గురించి నాడు ఫెర్గ్యుసన్ కాలేజ్‌లో నేను మాట్లాడాను. ట్రస్ట్ డెఫిసిట్ నుంచి ట్రస్ట్ సర్‌ప్లస్‌కు చేసిన జర్నీ గురించి చెప్పమని మనోజ్ నన్ను అడిగారు. ఇప్పుడు ట్రస్ట్ సర్‌ప్లస్ అనేది.. పాలసీల్లోనూ, ప్రజల హార్డ్‌వర్క్‌లోనూ కనిపిస్తోంది” అని వివరించారు.
‘తిలక్ విగ్రహ ఏర్పాటుపై 1929లో బ్రిటీష్ ప్రభుత్వాన్ని సర్దార్ పటేల్ ఎదిరించారు. నాడు బానిసత్వం కొనసాగుతున్న కాలంలోనే.. తిలక్ కోసం బ్రిటీష్ సామ్రాజ్యాన్ని సవాలు చేశారు. కానీ ఇప్పుడు.. విదేశీ ఆక్రమణదారుడి పేరుతో ఉన్న రోడ్డు పేరును మారిస్తేనే కొందరు ఏడుస్తున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు’ అని మండిపడ్డారు.
వెళ్లకుండా ఉండాల్సింది.. శివసేన (యూబీటీ)
ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వేదిక పంచుకోవడంపై శివసేన (ఉద్ధవ్) స్పందిం చింది. ఆయనపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది.
ఒకే వేదికపై మోదీ, శరద్ పవార్
ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ బయటికి వచ్చి బీజేపీ, శివసేన ప్రభుత్వంలో కలిసిన తర్వాత తొలిసారిగా.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ప్రధాని మోదీ ఒకే వేదికపై కనిపించారు. మోదీకి లోక్‌మాన్య తిలక్ నేషనల్ అవార్డును అందజేసే కార్యక్రమంలో పవార్ పాల్గొన్నారు. ఇద్దరు నేతలు కొద్దిసేపు ముచ్చటిం చుకున్నారు. శరద్ పవార్‌కు మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ షేక్‌హ్యాండ్ ఇచ్చా రు. అజిత్ పవార్ మాత్రం ముందుకు వెళ్లిపోయారు.
శివాజీ ఎవరి భూమినీ లాక్కోలే: శరద్ పవార్ కామెంట్
ఈ కార్యక్రమంలో పరోక్షంగా మోదీపై శరద్ పవార్ విమర్శలు చేశారు. శివసేన, ఎన్సీపీని చీల్చడాన్ని ఉద్దేశిస్తూ.. ఛత్రపతి శివాజీ ఎన్నడూ ఏ ఒక్కరి భూమిని లాక్కోలేదని అన్నారు. దేశంలో తొలి సర్జికల్ స్ట్రైక్స్ శివాజీ కాలంలోనే జరిగాయని చెప్పారు. దేశం రెండు శకాలను చూసిందని, ఒకటి తిలక్, రెండోది గాంధీ శకం అని అన్నారు.