తగ్గేదేలే.. భూపాలపల్లి నాదేనంటున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

తగ్గేదేలే.. భూపాలపల్లి నాదేనంటున్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
  •  భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ నాదేనంటున్న ఎమ్మెల్సీ
  •  ఎమ్మెల్యే గండ్రకే  టికెట్‌‌ అని ప్రకటించిన కేటీఆర్‌‌
  •  మధుసూదనాచారి, గండ్రల మధ్య ముదురుతున్న వివాదం  

జయశంకర్‌‌ భూపాలపల్లి వెలుగు: భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్‌విషయంలో ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వెనక్కి తగ్గడం లేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. కొద్ది రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ  కార్యకర్తలను కలుస్తున్నారు. దీంతో  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గంలో అలజడి స్టార్ట్‌‌ అయ్యింది. 

ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ సిరికొండ సమక్షంలోనే గండ్రకే ఎమ్మెల్యే టికెట్‌‌అని స్వయంగా కేటీఆర్‌‌ ప్రకటించారు. సిరికొండను శాసనమండలిలోనే ఉంటారని పేర్కొన్నారు. ఇది జరిగిన తర్వాత రెండు నెలల పాటు మౌనంగా ఉన్న సిరికొండ మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్‌‌విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే టికెట్‌‌ఎవరిని వరిస్తుందో  తెలియక పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది.   

రెండు వర్గాల మధ్య పోరు

బీఆర్‌‌ఎస్‌‌ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులలో మధుసూదనాచారి‌ ఒకరు. కేసీఆర్‌‌కు అత్యంత సన్నిహితుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన‌కు వెన్నుదన్నుగా నిలిచారు. పార్టీ తరపున 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి స్పీకర్‌‌ బాధ్యతలు అందుకున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గండ్ర  బీఆర్‌‌ఎస్‌‌లో చేరారో అప్పటి నుంచి నియోజకవర్గంలో రెండు వర్గాలయ్యాయి. కాంగ్రెస్‌‌ పార్టీలో పనిచేసిన వాళ్లంతా బీఆర్‌‌ఎస్‌‌లో చేరి ఎమ్మెల్యే గండ్రతో ఉండగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్లంతా సిరికొండ పక్షాన ఉన్నారు. 

ఎమ్మెల్యే టికెట్‌‌ విషయంలో ఫైట్‌‌

మరి కొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్‌‌ విషయంలో  పార్టీలో టైట్‌‌ ఫైట్‌ ‌నెలకొంది. సీఎం కేసీఆర్‌‌కు  ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికలలో పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా కేసీఆర్‌‌ ఎమ్మెల్యే టికెట్‌‌తనకే  ఇస్తారని సిరికొండ చాలా నమ్మకంగా చెబుతున్నారు. నియోజకవర్గంలో పర్యటించిన ప్రతిచోట ఇదే మాట అంటున్నారు. 

గత ఫిబ్రవరిలో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లిలో  భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న కేటీఆర్‌‌ రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే గండ్రకే పార్టీ ఎమ్మెల్యే టికెట్‌‌అని ప్రకటించారు. ఆ సభలో మధుసూదనాచారి కూడా ఉన్నారు. ఆ తర్వాత రెండు నెలల పాటు  సిరికొండ సైలెంట్‌‌అయ్యారు. 

ఇటీవల సీఎం కేసీఆర్‌ ‌మహారాష్ట్ర పర్యటన సమయంలో విమానంలో సీఎం ప్రక్కన మధుసూదనాచారి కూర్చొన్న ఫొటోలు సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌అయ్యాయి. ఆ తర్వాత నుంచి మళ్లీ సిరికొండ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎమ్మెల్యే టికెట్‌‌తనదేనని చెబుతూ వస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్‌‌ఇచ్చిన హామీ వల్ల సిరికొండ మళ్లీ భూపాలపల్లిలో తిరుగుతున్నారా? అలా అయితే కేటీఆర్‌‌ఇచ్చిన హామీ ఉట్టిదేనా? అని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతుంది. ఏదీ ఏమైనా  ఎమ్మెల్యే గండ్ర నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరిట  పర్యటిస్తూ రాబోయే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ తరపున పోటీచేసేది తానేనని, మరోసారి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.