ఇల్లెందు, వెలుగు: అధికార పార్టీ అండదండలతో భూ ఆక్రమణకు యత్నిస్తూ తమపై దాడులకు దిగుతున్నారంటూ ఓ మహిళ గోడు వెళ్లబోసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణం కొత్త బస్టాండ్ దగ్గరున్న సర్వే నంబర్ 626లోని ఐదు ఎకరాల భూమిని ఇల్లెందులపాడుకు చెందిన గిట్ల పోచమ్మ కుటుంబం తరతరాలుగా సాగు చేసుకుంటోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో స్థానికంగా ఉంటున్న కొంతమంది భూ ఆక్రమణకు యత్నిస్తూ తమపై దాడులు చేస్తున్నారని గిట్ల పోచమ్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ భూమికి సంబంధించి తమ వద్ద కూడా పట్టాలున్నాయంటూ మరొక వర్గం ఆరోపిస్తోంది. ఇరువర్గాలవారు తరచూ స్థలం విషయంలో ఘర్షణలకు దిగుతున్నారు. ఈ భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. స్థలంలో ఏర్పాటు చేసుకున్న బోర్డు, షెడ్డును శుక్రవారం దౌర్జన్యంగా తీసివేయడమే కాకుండా మహిళలని కూడా చూడకుండా తమపై దాడి చేసి గాయపరిచారని గిట్ల పోచమ్మ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ రెవెన్యూ, పోలీస్ అధికారులను సంప్రదించినా లాభం లేకపోయిందని, అధికారులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడులకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ కేసులు నమోదు చేయడం లేదని చెప్పారు. 30 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిపై దౌర్జన్యాలు చేస్తున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.
