సీఎం ఇచ్చిన ఫండ్స్​లో వాటాలపై లొల్లి

సీఎం ఇచ్చిన ఫండ్స్​లో వాటాలపై లొల్లి
  • సాగర్​ ఎన్నికల కోసం నల్గొండ జిల్లాకు సీఎం ఇచ్చిన రూ.199 కోట్లలో వాటాల లొల్లి

నల్గొండ, వెలుగు: సాగర్​ఉప ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్​ఇచ్చిన స్పెషల్ ఫండ్స్ పై ఎమ్మెల్యేలు పెత్తనం చెలాయిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా అక్కడి  పాలకమండళ్ల తీర్మానం మేరకు పనులు చేపట్టాల్సి ఉన్నా, లోకల్​ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్​ లీడర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. రూల్స్​ప్రకారం సర్పంచులు, మున్సిపల్​చైర్​పర్సన్ల ద్వారా ప్రపోజల్స్ తెప్పించి శాంక్షన్​ చేయాల్సిన ఆఫీసర్లు.. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి నుంచి వచ్చిన ప్రపోజల్స్​నే ఒకే చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చాలా గ్రామాలు, పట్టణాల్లో పనులకు సంబంధించి తమ మాట కాకుండా పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, మంత్రి అనుచరుల మాటే చెల్లుబాటు అవుతోందని, తమ అనుచరుల కోసం అవసరం లేని చోట పనులు చేపడుతున్నారని లోకల్​సర్పంచులు, మున్సిపల్​చైర్​పర్సన్స్​ నారాజ్​ అవుతున్నారు.
199.10 కోట్ల నిధులు​ మంజూరు 
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లాకు స్పెషల్ డెవలప్​మెంట్​ఫండ్స్(ఎస్డీఎఫ్) మంజూరు చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామానికి రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షలు, 8 మున్సిపాలిటీలకు రూ.21 కోట్లు కలిపి మొత్తం రూ.199.10 కోట్లు కేటాయిస్తూ జూన్​లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. పనుల శాంక్షన్​, ఫండ్స్​ రిలీజ్​కు సంబంధించి జిల్లా కలెక్టర్లకే పూర్తి అధికారాలు కట్టబెట్టారు. ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీలో వర్క్స్ గుర్తించి, ప్రపోజల్స్ తెప్పించాలని పేర్కొన్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం తమ సిఫార్సుతో వచ్చిన పనులకే ప్రాధాన్యం ఇచ్చేలా ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
పేరుకే సర్పంచుల తీర్మానాలు..
ఎస్డీఎఫ్ రూల్స్ ప్రకారం జిల్లా కలెక్టర్లు సర్పంచుల ద్వారా ప్రపోజల్స్ తెప్పించాలి. వాటిని ఆమోదించిన తర్వాత పనుల పర్యవేక్షణ సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్​మెంట్లకు అప్పగించాలి. కానీ జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపాదించిన పనులపై సర్పంచులు తీర్మానం చేసి మొదట ఎమ్మెల్యేలకు పంపిస్తే అక్కడి నుంచి జిల్లా మంత్రి ద్వారా ఆమోదం పొందాకే కలెక్టర్లకు పంపుతున్నారు. దీంతో సర్పంచుల తీర్మానాలు మొక్కుబడి కార్యక్రమంగా మారుతున్నాయి.
సొంత మనుషులకూ పనులు
ఎమ్మెల్యేలకు తమ నియోజకవర్గ అభివృద్ధి (సీడీపీ) ఫండ్స్ పై పూర్తి అధికారాలను ప్రభుత్వం కల్పించింది.  కానీ ప్రస్తుత ఎస్డీఎఫ్ ఫండ్స్ కింద చేపట్టబోయే వర్క్స్​కు సంబంధించిన పూర్తి అధికారాలు కలెక్టర్లకు ఇచ్చారు. సర్పంచులు, మున్సిపల్​చైర్​పర్సన్ల ప్రపోజల్స్​ను, పాలకమండళ్ల తీర్మానాలను పరిగణలోకి తీసుకొని శాంక్షన్​ఆర్డర్​ఇయ్యాలి.  కానీ ఫీల్డ్​లెవల్​లో ఎమ్మెల్యేలే పెత్తనం చెలాయిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచులు ఉన్న గ్రామాల్లో సమస్య మరీ తీవ్రంగా ఉంది. ఉదాహరణకు దేవరకొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు గ్రామాల సర్పంచులు వర్క్స్ ప్రపోజల్స్ ను సీపీఓ ఆఫీస్​కు పంపితే, శాంక్షన్​ చేయకుండా పక్కన పెట్టారు. అడిగితే ఎమ్మెల్యే సిఫార్సుతో రాలేదనే కారణం చెబుతున్నారు. నల్గొండ మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, మిర్యాలగూడకు రూ.5 కోట్లు, మిగిలిన ఆరు మున్సిపాలిటీలకు రూ. 6కోట్లు కేటాయించగా ఇ క్కడ కూడా ఎమ్మెల్యేలదే ఫైనల్ నిర్ణయమని చెప్తున్నారు. చైర్మన్లకు, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉన్న మున్సిపాలిటీల్లో ఎస్డీఎఫ్ కొత్త చిచ్చు పెట్టింది. అలాంటి చోట చైర్మన్ ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేలే సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో సర్పంచులు, కౌన్సిలర్లతో పాటు తమ అనుచరులకు కూడా పనులు ఇప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో అవసరం లేని చోట కూడా పనులు శాంక్షన్​ చేయించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నల్గొండ లాంటి మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యే జోక్యాన్ని కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారు. పాలకవర్గం తీర్మానంతో వార్డుల్లో వర్క్స్ చేయాలే తప్ప.. మొత్తం ఒకే ప్రాంతానికి వర్క్స్ కేటాయించడాన్ని కౌన్సిలర్లు తప్పు పడ్తున్నారు. 

గ్రామాలకు వచ్చిన ఎస్డీఎఫ్​తో ఎవరికి ఏ వర్క్ ఇయ్యాలన్నది తానే ఫైనల్ చేస్తానని నల్గొండ జిల్లాలోని ఓ ఎమ్మెల్యే చెప్తున్నారు. ఒక గ్రామానికి రూ.20 లక్షలు వస్తే.. దీంట్లో సర్పంచుకు రూ.5 లక్షలు, మిగిలిన 15 లక్షల్లో తన మనుషులకు తలా రూ. 5 లక్షల చొప్పున పనులు ఇయ్యాలని తీర్మానించారు. దీనిపైన సర్పంచులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మండల కేంద్రానికి వచ్చిన రూ.30 లక్షల ఫండ్స్ విషయంలోనూ ఆ ఎమ్మెల్యే చెప్పిందే ఫైనల్ చేయడంపై సర్పంచుల నుంచి వ్యతిరేకత వస్తోంది. 

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉండడంతో ప్రపోజల్స్ జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి ద్వారా ఇవ్వాలా.. లేదంటే నియోజకవర్గ ఇన్​చార్జి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ద్వారా పంపించాలా అని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికైతే అధికార పార్టీ సర్పంచ్ లేనిచోట ఎంపీటీసీలను రంగంలోకి దింపాలని అనుకుంటున్నారు. మునుగోడు మండలంలో 27 మంది సర్పంచులు ఉండగా అందులో 22 మంది కాంగ్రెస్ కు చెందినవారే. దీంతో వర్క్ ప్రపోజల్స్ ఎట్లా చేయాలా అని అధికార పార్టీ లీడర్లు మల్లగుల్లాలు పడ్తున్నారు.