శనగ  పంట  కొనుగోళ్లలో మళ్లీ గందరగోళం

శనగ  పంట  కొనుగోళ్లలో మళ్లీ గందరగోళం

నిర్మల్, వెలుగు:  నిర్మల్  జిల్లాలో శనగ  పంట  కొనుగోళ్లలో మళ్లీ గందరగోళం నెలకొంది. ఏటా శనగ కొనుగోళ్లతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి కూడా మార్క్‌‌‌‌ఫెడ్, పీఏసీఎస్‌‌‌‌ల  ఆధ్వర్యంలో  శనగ కొనుగోళ్లు  ప్రారంభం కాగా ఆదిలోనే విమర్శల పాలవుతోంది. ముఖ్యంగా టోకెన్ల జారీ విషయంలో మార్క్‌‌‌‌ఫెడ్  అధికారులు సరైన విధానం పాటించకపోవడం వల్లే సమస్య తలెత్తుతోందని  రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయా పీఏసీఎస్‌‌‌‌ల వద్ద టోకెన్ల కోసం రైతులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు  బారులుదీరుతున్నారు. 

జిల్లాలో 67వేల ఎకరాల్లో సాగు

జిల్లాలో ముథోల్, బాసర, తానూర్, బైంసా, కుబీర్, సారంగాపూర్ మండలాల్లో దాదాపు 67 వేల ఎకరాల్లో శనగ సాగుచేశారు. ఎకరానికి 6 క్వింటాళ్ల చొప్పున సుమారు నాలుగు లక్షల క్వింటాళ్ల దిగుబడి రావచ్చని అధికారులు లెక్కగట్టారు. మార్క్‌‌‌‌ఫెడ్ లక్ష క్వింటాళ్ల పంట కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం క్వింటాల్​ శనగకు మార్క్‌‌‌‌ఫెడ్​రూ.5,335 మద్దతు ధర చెల్లిస్తోంది. అయితే ప్రైవేట్​వ్యాపారులు, దళారులు కేవలం రూ.2,600 చెల్లిస్తుండడంతో రైతులంతా కొనుగోలు సెంటర్లలోనే అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. పంట దిగుబడి భారీగా ఉండడంతో కొనుగోళ్లకు సంబంధించి టోకెన్లు జారీ చేస్తున్నారు. వాటిల్లో ఇచ్చిన తేదీల ప్రకారమే రైతులు పంట తీసుకురావాల్సి ఉంటుంది. అయితే అవసరమైనన్ని కొనుగోలు సెంటర్లను ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కుబీర్, ముథోల్, తానూర్, మిర్జాపూర్, బాసర, సారంగపూర్ లో మాత్రమే పీఏసీఎస్‌‌‌‌ల సహకారంతో మార్క్‌‌‌‌ఫెడ్​కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. కొనుగోలు సెంటర్ల ఏర్పాటులో మార్క్‌‌‌‌ఫెడ్ ​నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

గోడౌన్లు  ఉన్నా సెంటర్లు ఏర్పాటు చేయలే..

 పీఏసీఎస్‌‌‌‌ల ఆధ్వర్యంలో చాలా చోట్ల గోడౌన్లు ఉన్నప్పటికీ అక్కడ శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఆష్టా, కారేగాం తదితర చోట్ల గోడౌన్లు అందుబాటులో ఉన్నాయి. బైంసా డివిజన్‌‌‌‌లో కుబీర్, ముథోల్, తానూర్, మిర్జాపూర్, బాసరలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయగా.. నిర్మల్​డివిజన్‌‌‌‌లో ఒక్క సారంగాపూర్ మండల కేంద్రంలోనే ఉంది.  దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎకరానికి ఐదు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని నిబంధనలు పెడుతున్నట్లు రైతులు చెబుతున్నారు. దిగుబడితో సంబంధం లేకుండా పంట  కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతేడాది చెల్లింపుల వ్యవహారంలో కూడా మార్క్‌‌‌‌ఫెడ్​ అబాసుపాలైంది. వారంలోగా చెల్లింపులు చేయాల్సి ఉండగా.. నెలలు గడిచినా డబ్బులు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి అలా కాకుండా సకాలంలో చెల్లింపులు జరపాలని రైతులు కోరుతున్నారు

పంట కొనుగోలుపై  ఆందోళన వద్దు..

శనగ  పంట కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందొద్దు. మొత్తం పంట కొంటాం. డిమాండ్ మేరకు టోకెన్లు జారీ చేస్తాం. వాటి ప్రకారమే రైతులు పంటను సెంటర్లకు తీసుకురావాలి. కొనుగోళ్లు పూర్తయ్యేదాకా సెంటర్లను కొనసాగిస్తాం. సకాలంలో చెల్లింపులు చేస్తాం.

- గౌరీ నాగేశ్వర్, డీఎం,  మార్క్‌‌‌‌ఫెడ్, నిర్మల్