
- క్లారిటీ వస్తే ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతామంటున్న అభ్యర్థులు
- ప్రిపరేషన్ కోసం కొలువులకు వేలాది మంది సెలవులు
హైదరాబాద్, వెలుగు: గ్రూప్1 అభ్యర్థుల్లో అయోమయం మొదలైంది. ప్రిలిమ్స్ ఫైనల్ కీ ఇచ్చి నెలరోజులు కావొస్తున్నా, ఇప్పటికీ మెయిన్స్ పికప్లిస్టును టీఎస్పీఎస్సీ రిలీజ్ చేయట్లేదు. అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా స్పష్టంగా చెప్పడం లేదు. దీంతో తమ పేరు మెయిన్స్ లిస్టులో ఉంటుందో లేదో అనే ఆందోళన వారిలో నెలకొన్నది. ఈ నేపథ్యంలో గ్రూప్1 కు ప్రిపేర్ కావాలా? లేదా? అనేది డిసైడ్ కాలేకపోతున్నారు. 503 పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెలాఖరులో టీఎస్పీఎస్సీ గ్రూప్1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివిధ కారణాలతో జులై/ఆగస్టులో జరగాల్సిన ప్రిలిమ్స్పరీక్ష, అక్టోబర్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 2.86లక్షల మంది హాజరు కాగా, నవంబర్ లో ఫైనల్ ‘కీ’ రిలీజ్ చేశారు. జనవరి లేదా ఫిబ్రవరిలో మెయిన్స్ ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే ఫైనల్ కీ ఇచ్చి నెలరోజులు కావొస్తున్నా, ఇప్పటికీ మెయిన్స్ పికప్ లిస్ట్ (మెరిట్)ను రిలీజ్ చేయలేదు. దీంతో తాము టీఎస్పీఎస్సీ ప్రకటించే 1:50 లిస్టులో ఉంటామో లేదో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. ఇంకొపక్క టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తోంది. ఈ లిస్టులో లేమని తేలిస్తే, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతామనీ అభ్యర్థులు చెబుతున్నారు.
ఉద్యోగాలకు సెలవులు పెట్టి..
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ సమయంలోనే చాలామంది సర్కారు, ప్రైవేటు ఉద్యోగులు తమ కొలువులకు సెలవులు పెట్టారు. ఇంకొందరు రాజీనామాలు చేశారు. ఐదారు నెలలు సెలవులు పెట్టిన వారిలో ఎక్కువ మంది గడువు ఫిబ్రవరిలో పూర్తి కానున్నది. అయితే మెయిన్స్ కు ఎంపిక అవుతామంటే, ప్రిపేర్ కావొచ్చు. కానీ దానిపై క్లారిటీ రాకపోవడంతో వారంతా ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. ఒక్కో సబ్జెక్టు కోచింగ్కు రూ.10వేల నుంచి రూ.15వేల వరకూ ఉంటుంది. దీంతో పాటు హాస్టల్, స్టడీ రూమ్ రెంట్లు ఇవన్నీ అభ్యర్థులకు భారంగా మారింది. అయితే ప్రైవేటు ఉద్యోగులు కొలువులు మానేయడంతో, ఇంటి నుంచి డబ్బు తీసుకోవాల్సి వస్తోంది. ప్రతినెలా అడుగుతుంటే కొంత ఇబ్బందిగా ఉంటుందని వారంతా వాపోతున్నారు. అయితే ప్రిలిమ్స్ ఫలితాలు ఆలస్యమవుతాయనో లేదా లిస్టు ప్రకటిస్తేనో ఇక్కడే ఉండాలో లేదా క్లారిటీ వస్తుందని అభ్యర్థులు చెప్తున్నారు.
హైకోర్ట్ బెంచ్ మీదకు కూడా వెళ్లని ఫైల్..
గ్రూప్1 పోస్టులను వర్టికల్ పద్ధతిలో భర్తీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హారిజెంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలనీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తుది తీర్పునకు లోబడే పోస్టుల భర్తీ ఉంటుందనీ తెలిపింది. అయితే సర్కారు మాత్రం ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాతే, దీనిపై ముందుకు పోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీ అదే మాట చెప్తూ వస్తోంది. హైకోర్టులో ఇంకా ఆ కేసు ఫైల్ బెంచి మీదికి కూడా రాకపోవడంతో, అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్య త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతున్నారు.
ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాలేక..
ప్రస్తుతం టీఎస్పీఎస్సీ గ్రూప్4 తో పాటు జేఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్తదితర వరుస నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. త్వరలోనే గ్రూప్–2, గ్రూప్–3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు.. మెయిన్స్ కు ప్రిపేర్ కావాలా లేక ఇతర పరీక్షలకు సన్నద్ధం కావాలా అనేదానిపై నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ గ్రూప్1 మెయిన్స్ పికప్ లిస్టులో పేరు లేకపోతే, ఇతర పోటీ పరీక్షలకు రెడీ కావొచ్చు. కానీ రిజల్ట్ రాకపోవడంతో వారంతా ఏం చేయాలనే దానిపై సందిగ్ధంలో ఉన్నారు. మెయిన్స్ ఎగ్జామ్ తీరు, ఇతర పోటీ పరీక్షల తీరు పూర్తిగా భిన్నం. దీంతో వారంతా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.