జాగ ఉన్నా పట్టా లేకపాయే.. గృహలక్ష్మి ఎట్ల?

 జాగ ఉన్నా పట్టా లేకపాయే.. గృహలక్ష్మి ఎట్ల?
  •     సింగరేణి ప్రాంతాల్లో వర్తించేనా
  •     ఏజెన్సీ ప్రాంత భూములపై సామాన్యులకు హక్కుల్లేవ్​
  •     రిజిస్ట్రేషన్​ పేపర్లు తప్పనిసరంటున్న ఆఫీసర్లు
  •     ఆందోళన చెందుతున్న దరఖాస్తుదారులు

కోల్​బెల్ట్​,వెలుగు :  గృహాలక్ష్మి స్కీంకు దరఖాస్తు చేయడంలో  సింగరేణి ప్రాంతాల్లో గందరగోళం నెలకొంది.  అప్లికేషన్‌‌లో తప్పనిసరిగా ‌‌రిజిస్ట్రేషన్ పేపర్ జత చేయాలంటూ పెట్టిన నిబంధనతో ఇబ్బందులు పడుతున్నారు.మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి, నస్పూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లోని ఖాళీ స్థలాలపై స్థానికులకు ఎలాంటి యాజమాన్యపు హక్కులు లేవు.  దీంతో గృహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా మారింది.  రాష్ట్ర సర్కార్​ సింగరేణి ఖాళీ స్థలాల్లో (సింగరేణి ప్రభుత్వానికి సరెండర్​ చేసిన ప్రాంతాల్లోని) ఇండ్ల నిర్మాణాలు చేసుకున్న వారికి పట్టాలు అందించింది.  సింగరేణేతర మున్సిపాలిటీలు,  పంచాయతీల్లో జీవో నంబర్​58 ద్వారా125 గజాలలోపు ఉన్న  అసైన్డ్​ స్థలాలను క్రమబద్ధీకరించారు.  అంతకు ఎక్కువ ఉన్న  స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి జీవో నంబర్​59 ప్రకారం మార్కెట్​ రేట్​ చెల్లించాలని సర్కార్​ ఛాన్స్ కల్పించింది. మున్సిపాలిటీల్లో భూముల ధరలు 60  నుంచి 70 శాతం అధికంగా ఉండటంతో క్రమబద్దీకరణకు ఎవరూ ముందుకు రాలేదు. 

ఆర్థిక స్థోమత కుటుంబాలు ఇండ్లు నిర్మించుకోలేక  ఏళ్ల తరబడి తమ జాగలను ఖాళీగా ఉంచుతున్నారు.  సింగరేణికి సరెండర్​ చేయని ఖాళీ స్థలాలను స్థానికులు ఏళ్లుగా కాపాడుకుంటున్నారు. అయితే  ఈ స్థలాలు సింగరేణి కంపెనీ పరిధిలో ఉండటంతో వీటిపై స్థానికులకు ఎలాంటి భూ యాజమాన్యపు హక్కులు లేకుండా పోయాయి.  ప్రస్తుతం గృహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా స్థల ‌‌రిజిస్ట్రేషన్ పేపర్ జత చేయాలంటు పెట్టిన నిబంధనతో స్థానికులు తమకు స్కీమ్ వర్తిస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు.  ఓటర్​ఐడీ, ఆధార్​కార్డు, ఇంటి నెంబర్​, కరెంటు మీటర్, సాదాబైనామా, నోటరీ, రేషన్​కార్డు తదితర అంశాలను స్థల రిజిస్ర్టేషన్​ కింద పరిగణలోకి తీసుకొని గృహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే సడలింపు ఇవ్వాలని క్యాతనపల్లి, నస్పూర్​, బెల్లంపల్లి, మందమర్రి సింగరేణి ప్రాంత మున్సిపాలిటీ వాసులు కోరుతున్నారు. 
 

జిల్లాలో 9,400 ఇండ్లు మంజూరు

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గృహలక్ష్మి పథకం కింద మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో 9,400 ఇండ్లను మంజూరు చేశామని జిల్లా కలెక్టర్​ బదావత్​ సంతోష్  ప్రకటించారు.   ఈ నెల 7 నుంచి10 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు.  మంగళవారం నుంచి ఆయా తహసీల్దార్, మున్సిపాలిటీలు, ఎంపీడీవో ఆఫీస్​లు, కలెక్టరేట్​వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి అర్హుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. 

ఏజెన్సీ ప్రాంతల్లో సాధ్యమేనా?

జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీ ఏజెన్సీ ప్రాంతంగా కొనసాగుతోంది. ఇక్కడ భూములపై యాజమాన్యపు హక్కులు, క్రయవిక్రయాలు చేయడంపై కేవలం గిరిజనులకే  హక్కు ఉంది.  సింగరేణిలో ఉద్యోగాలు పొందిన గిరిజనేతరులు మందమర్రిలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు.  సింగరేణి క్వార్టర్లతో కలిపి సుమారు 13 వేల ఇండ్లు మున్సిపాలిటీలో ఉన్నాయి. తమ స్థలాలకు ఎక్కడి నుంచి రిజిస్ర్టేషన్​ పేపర్లు  తేవాలని, తమకు సడలింపు ఇవ్వాలని కోరుతున్నారు.  నిబంధన ప్రకారం గృహాలక్ష్మి పథకం వర్తింపునకు తప్పనిసరిగా స్థల రిజిస్ర్టేషన్​ పేపర్​ను జతచేయాల్సి ఉంటుందని మందమర్రి మున్సిపల్​కమిషనర్​ గద్దె రాజు పేర్కొన్నారు.