అసెంబ్లీలో వీడియోలు తీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

అసెంబ్లీలో వీడియోలు తీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  •  పోడియం వద్ద బైఠాయించిన బీఆర్ఎస్
  •  నల్లబ్యాడ్జీలు ధరించి సభకు అంతరాయం
  •  నిబంధనలకు విరుద్ధంగా వీడియోల చిత్రీకరణ
  •  వీడియోలు తీసిన వారిపై చర్యలు తీసుకునే చాన్స్
  •  అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆందోళన
  •  బీఆర్ఎస్ ఆఫీసుకు తరలించిన మార్షల్స్

హైదరాబాద్: అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. నల్లబ్యాడ్జీలు ధరించి సభలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలకమైన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన తరుణంలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అంతకు ముందు మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. 

ఎమ్మెల్యేల గౌరవం, ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ముఖ్యమంత్రి మాట్లాడారని, ఈ అంశంపై శాసన సభలో చర్చించాలని పేర్కొంటూ అసెంబ్లీ కార్యదర్శికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ నోటీలులు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డిపై నిన్న చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. 

అయితే అలా వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని స్పీకర్ చెప్పినా వినలేదు. ఎవరెవరు వీడియోలు తీశారన్న అంశాన్ని స్పీకర్ పరిశీలిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతలోనే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన తీర్పు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పను స్వాగతిస్తున్నామని తెలిపారు. 

బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్ రావు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూనే నిన్నటి సంఘటనను ప్రస్తావించడంతో స్పీకర్ మైక్ కట్ చేశారు. సబ్జెక్ట్ డీవియేట్ చేయొద్దని సూచించారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మార్షల్స్ వారిని బీఆర్ఎస్ ఆఫీసుకు తరలించారు. ఈ సందర్భంగా  ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.