ఇంటర్ బోర్డులో గందరగోళం..సర్కారుకు బోర్డుకు మధ్య కోఆర్డినేషన్ సక్కగ లేదు

ఇంటర్ బోర్డులో గందరగోళం..సర్కారుకు బోర్డుకు మధ్య కోఆర్డినేషన్ సక్కగ లేదు
  • సిలబస్ ​తగ్గింపులోనూ ఆఫీసర్ల నిర్లక్ష్యం 

హైదరాబాద్, వెలుగు:   రాష్ట్ర ఇంటర్ బోర్డు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతోంది. గతేడాది ఇంటర్ మార్కుల గందరగోళం ఇష్యూ మొదలుకొని అనేక కాంట్రవర్సీలకు బోర్డు సెంటర్ గా నిలుస్తోంది. ఇటీవల బీఆర్ అంబేద్కర్, పూలే వంటి మహనీయుల పాఠాల తొలగింపుతో ఇంటర్ బోర్డు మళ్లీ కాంట్రవర్సీకి కారణమైంది. మార్చిలో ఎగ్జామ్స్​ను చాలా జాగ్రత్తగా నిర్వహించిన అధికారులు ఆ తర్వాత రిలాక్స్ అయ్యారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇంటర్ వాల్యూయేషన్ నుంచి ఇప్పటి వరకూ అనేక గందరగోళ నిర్ణయాలతో బోర్డు విమర్శలకు గురవుతోంది. ఇది సర్కారుకు, ఇంటర్ బోర్డు మధ్య కోఆర్డినేషన్ లోపాన్ని బయటపెడుతోంది.

వాల్యూయేషన్ నుంచి షురూ..

కరోనా వల్ల ఇంటర్ ఆన్సర్ షీట్ల వాల్యూయేషన్ మధ్యలోనే వాయిదా పడింది. జాగ్రత్తలు తీసుకుంటామన్న అధికారులు, లెక్చరర్లకు ఇచ్చిన చాలా హామీలు తీర్చలేదు. చాలా సెంటర్లలో శానిటైజర్లు, మాస్కులు కూడా ఇవ్వలేదు. కొన్ని సెంటర్లలో ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు పంపిణీ చేశాయి. లెక్చరర్లకు భోజనం పెట్టేందుకు మంత్రి అంగీకరించినా బోర్డు అధికారులు అమలు చేయలేదు. బస్సులు పెట్టినా లెక్చరర్ల వద్ద డబ్బులు వసూలు చేశారు.

ఆన్ లైన్ క్లాసులపై గందరగోళం  

ఆగస్టు17 నుంచి సెకండియర్​స్టూడెంట్స్​కు ఆన్​లైన్, డిజిటల్ క్లాసులు ప్రారంభిస్తామని16న సాయంత్రం 4 గంటలకు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆ తర్వాత రెండు గంటలకే..  క్లాసులను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. వర్షాలు పడుతుండటమే కారణమని సాకు చెప్పారు. ఆ తర్వాత సెప్టెంబర్1 నుంచి ఆన్​లైన్ క్లాసులను ప్రారంభించారు. ఫస్టియర్ క్లాసులను ఈ నెల18 నుంచి ప్రారంభించారు. 30 వరకూ అడ్మిషన్లకు గడువు ఇచ్చి, నోటిఫికేషన్ ఇచ్చిన మరుసటిరోజే క్లాసులు ప్రారంభించడంపైనా పేరెంట్స్ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

28 రోజులైనా బుక్స్ రాలే 

సెకండియర్ స్టూడెంట్స్​కు ఆన్​లైన్ క్లాసులు ప్రారంభమై 28 రోజులు అవుతున్నా ఇప్పటికీ అన్ని బుక్స్ అందలేదు. తెలుగు మీడియం సైన్స్​గ్రూపుల బుక్స్ మాత్రమే అందగా, హ్యూమానిటీస్ ​గ్రూపు బుక్స్ రాలేదు. ఈ నెల18 నుంచి ఫస్టియర్ స్టూడెంట్స్​కు కూడా ఆన్​లైన్ క్లాసులు అని ప్రకటించినా, ఇప్పటికీ వారికి బుక్స్ అందలేదు. దీంతో బుక్స్ లేకుండానే పాఠాలు వినడం స్టూడెంట్లకు ఇబ్బందిగా మారింది.

రికగ్నైజేషన్ లేకుండానే అడ్మిషన్లు..

ఫస్టియర్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఈ నెల16న ఇచ్చారు. కానీ అదేరోజు నుంచి 30 వరకు అడ్మిషన్లు చేసుకోవచ్చని ప్రకటించారు. దీంట్లోనే ఈ నెల18 నుంచి ఆన్​లైన్ క్లాసులని చెప్పారు. రికగ్నైజేషన్ ఉన్న కాలేజీలను వెబ్ సైట్​లో చూసుకుని, చేరాలంటూ రెండు పేజీల ప్రెస్​నోట్​లో చివరి పాయింట్ గా పెట్టారు. వెబ్ సైట్​లో మాత్రం ఆ రోజు ఒక్క ప్రైవేటు కాలేజీ పేరు కూడా లేదు. ఆ తర్వాత 77 ప్రైవేటు కాలేజీలకు పర్మిషన్ ఇచ్చామని చెప్పినా, ఆదివారం రాత్రి వరకూ 35 కాలేజీల పేర్లే ఉన్నాయి. మిగిలిన కాలేజీల్లో సెకండియర్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటనే దానిపైనా క్లారిటీ లేదు. మరోపక్క అన్ని ప్రైవేటు కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లూ పూర్తయ్యాయి.

అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఉంటదా.. లేదా

ఫెయిల్ అయిన సెకండియర్ స్టూడెంట్స్ ను సప్లిమెంటరీ లేకుండానే పాస్ చేసిన ప్రభుత్వం, ఫస్టియర్ స్టూడెంట్స్​కు అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో స్టూడెంట్లలో అయోమయం నెలకొంది. పరీక్షలు రాయని సెకండియర్ వాళ్లనూ పాస్ చేసేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అధికారులు వెల్లడించినా సర్కారు నుంచి  ప్రకటన రాలేదు. ఇప్పటికే దోస్త్ ఫస్ట్​ఫేజ్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. సెకండ్ ఫేజ్ నడుస్తోంది. దీంతో వాళ్లు ఆందోళన చెందుతున్నారు.

సిలబస్ తగ్గింపులో నిర్లక్ష్యం..

ఇంటర్​లో 30 శాతం సిలబస్​తగ్గింపుపై,  బోర్డు పరిధిలోని ఈఆర్ టీడబ్ల్యూ విభాగం కసరత్తు చేసింది. అయితే సివిక్స్, హిస్టరీ సబ్జెక్టుల్లో కీలకమైన లెసన్స్ తొలగింపుపై  పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. సీబీఎస్ఈ సిలబస్ తొలగింపు వివాదస్పదమైన తర్వాత కూడా, అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా సర్కారు, ఇంటర్ బోర్డు మధ్య సమన్వయ లోపంతోనే జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని, బోర్డును సెట్ చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.