
- అదే రోజు ఒక్కరికి ప్రమోషన్ ఇచ్చిన బీసీ శాఖ అధికారులు
- నెల పూర్తవుతున్నా మిగిలినవారి ప్రమోషన్ ఆర్డర్లు పెండింగ్‌లోనే
- ఎందుకు ఆపారో కూడా చెప్పని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు
హైదరాబాద్, వెలుగు: బీసీ సంక్షేమశాఖలో ప్రమోషన్లపై అయోమయం నెలకొన్నది. జిల్లా బీసీ సంక్షేమాధికారి (డీబీసీడీవో) పోస్టుల ప్రమోషన్ల కోసం డీపీసీ అప్రూవ్ చేసినా, వారికి ఆర్డర్లు ఇవ్వడం లేదు. ఒక్కరికి మాత్రమే ఇచ్చి, మిగిలిన వారికి ఆపడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం హాస్టళ్లు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా.. పూర్తి స్థాయి నియామకాలు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది. జిల్లాల్లో డీబీసీడీవో అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
వారే సంక్షేమశాఖతోపాటు కార్పొరేషన్ పనులనూ పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పోస్టులు రాష్ట్రంలో సగానికి పైగా జిల్లాల్లో ఇన్‌చార్జ్‌లే కొనసాగుతున్నారు. చిత్రంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా సిద్దిపేటలోనూ ఏబీసీడీవో, డీబీసీడీవో పోస్టులు రెండూ ఇన్‌చార్జ్‌లే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఐదేండ్ల తర్వాత డీబీసీడీవో పోస్టుల భర్తీ కోసం గత నెల 30న జరిగిన డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశం నిర్వహించారు.
దీంట్లో 13 మంది డీబీసీడీవోల ప్రమోషన్లకు ఆమోదం లభించినట్టు తెలిసింది. అయితే, అదే రోజు వీరిలో హైదరాబాద్ జిల్లాలో పనిచేసే ఓ ఏబీసీడీవో అధికారిణికి రిటైర్డ్ మెంట్ ఉండటంతో, ఆమెకు బీసీ కమిషన్ లో ప్రమోషన్ ఇచ్చారు. మిగిలిన 12 ఆర్డర్లు మాత్రం ఇంత వరకూ ఇవ్వలేదు. దీనికి కారణం కూడా అధికారులు చెప్పకపోవడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు.
ప్రమోషన్ లిస్టులో ఉన్న ఒకరిద్దరు ఈ నెలాఖరున రిటైర్డ్ అవుతున్నారు. దీంతో ప్రమోషన్లు ఇస్తారా లేదా అనే అయోమయం వారిలో నెలకొన్నది. ఇప్పటికైనా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకొని, సమస్యను పరిష్కరించాలని ఉద్యోగ, బీసీ సంఘాల నేతలు కోరుతున్నారు. కాగా, ఒకరికి ప్రమోషన్ ఇచ్చి, మిగిలిన వారివి ఆపడంపై బీసీ సంక్షేమశాఖ ఉన్నాధికారిని ‘వెలుగు’ వివరణ కోరగా.. ఇది ఇంటర్నల్ అంశమంటూ దాటవేయడం గమనార్హం.