హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియపై గందరగోళం నెలకొన్నది. ఈనెల 4న అట్టహాసంగా అడ్మిషన్ల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు.. మరుసటి రోజే ఆ షెడ్యూల్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. మరోపక్క ఇంటర్ కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటికే అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. అయినా, అటువైపే ఇంటర్ బోర్డు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ నెల 4న ఇంటర్ బోర్డు రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 8నుంచి ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. జూన్ ఫస్ట్ నుంచి క్లాసులు మొదలు కావాలి. కానీ, ఆ నిర్ణయం వెలువడిన 24 గంటలు గడవకముందే.. ఈనెల 5న బోర్డు కార్యదర్శి మరో సర్క్యులర్ జారీ చేశారు. కొన్ని సంస్కరణల ప్రతిపాదనల దృష్ట్యా ముందుగా ఇచ్చిన షెడ్యూల్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో కొత్త షెడ్యూల్ ఇస్తామని చెప్పడం బోర్డు అస్తవ్యస్త పనితీరుకు అద్దం పడుతోంది.
పర్మిషన్లు లేవు.. అడ్మిషన్లు ఫుల్
బోర్డు అధికారికంగా అడ్మిషన్ల షెడ్యూల్ ఇవ్వక ముందు నుంచే కార్పొరేట్ కాలేజీలలో అడ్మిషన్ల ప్రక్రియ యథేచ్ఛగా కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం బోర్డు నుంచి గుర్తింపు పొందిన తర్వాత, బోర్డు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అడ్మిషన్లు చేపట్టాలి. ఇంకా అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 209 ప్రైవేటు కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చాయి. హైదరాబాద్ లో 40 ప్రైవేటు కాలేజీలకే గుర్తింపు లభించింది. గుర్తింపుతో సంబంధం లేకుండానే దాదాపు అన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు పూర్తి చేస్తున్నాయి.
హైస్కూళ్లలో ప్లస్ 2 అడ్మిషన్లు?
ఇప్పటికే రాష్ట్రంలో ఎస్ఎస్సీ బోర్డులో ఇంటర్ బోర్డును విలీనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి హైస్కూళ్లలో ప్లస్ 2 అడ్మిషన్లు తీసుకుంటే ఎలా ఉంటుందనే దానిపై విద్యా శాఖ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డుకు ఉన్న స్పెషల్ యాక్ట్ ను ఎలా మార్చాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు.
మంగళవారం దీనిపై విద్యా శాఖ ఇన్ చార్జి సెక్రటరీ శ్రీదేవసేన, ఇంటర్ బోర్డు సెక్రెటరీ అభిలాష, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, విద్యా శాఖ జాయింట్ సెక్రటరీ పుల్లారావు తదిరతులు సమావేశమైనట్టు తెలిసింది. అయినా, విద్యా సంవత్సరం ప్రారంభానికి 20 రోజుల ముందు ఇలాంటి రీఫామ్స్ పై చర్చించడం ఏంటని విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రక్రియలు కనీసం ఆరు నెలల ముందు నుంచే ప్రారంభించాలని, హడావుడి నిర్ణయాలతో ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నారు.
