టీచర్ల ప్రమోషన్లపై అయోమయం.. టెట్‌‌ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు

టీచర్ల ప్రమోషన్లపై అయోమయం.. టెట్‌‌ క్వాలిఫై అవ్వాలన్న అంశంపై తొలగని అనుమానాలు
  •    ఒకే లెవెల్ పోస్టులకు టెట్‌‌ క్వాలిఫై అవసరం లేదంటున్న టీచర్లు 
  •     ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్‌‌ కంపల్సరీ అంటున్న విద్యాశాఖ 
  •     దీనిపై మరోసారి స్పష్టత కోరుతూ ఎన్‌‌సీటీఈకి విద్యాశాఖ లేఖ

హైదరాబాద్, వెలుగు: టీచర్ల ప్రమోషన్లకు కచ్చితంగా ‘టెట్’క్వాలిఫై అవ్వాలన్న అంశంపై ఇంకా అయోమయం నెలకొంది. ప్రధానంగా హెడ్మాస్టర్ పోస్టులతో పాటు లాంగ్వేజీ పండింట్లకు చెందిన ప్రమోషన్ల అంశంపై కూడా క్లారిటీ రావడం లేదు. అయితే ఒకే స్కూల్ లెవెల్ ప్రమోషన్ పోస్టులకు టెట్ అవసరం లేదని టీచర్ల సంఘాలు చెప్తుండగా, ప్రతి ప్రమోషన్ పోస్టుకు టెట్ క్వాలిఫై తప్పనిసరని ఎన్‌‌సీటీఈ రూల్స్ చెప్తున్నాయని విద్యా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో మరింత స్పష్టత కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌‌సీటీఈ)కు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా 2010లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అంశం తెరమీదికి వచ్చింది.

ఇందులో భాగంగా కొత్త రూల్స్‌‌తో పాటు ప్రమోషన్లకూ టెట్ అమలు చేయాలని ఎన్‌‌సీటీఈ పేర్కొంది. అయితే, రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లకు మాత్రం ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తీసుకుంటూ అమలును తాత్కాలికంగా వాయిదా వేస్తూ వచ్చారు. ప్రమోషన్లలోనూ టెట్‌‌ను అమలు చేయాలని కొందరు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఇటీవల టెట్ నోటిఫికేషన్ వేయడంతో టీచర్లు కూడా టెట్ రాయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, దీంట్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని టీచర్ల సంఘాల నేతలు చెప్తున్నారు. 

మస్తు అనుమానాలు..

ఎస్జీటీ, ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ (పీఎస్‌‌హెచ్‌‌ఎం) పోస్టులు ప్రైమరీ లెవెల్ పోస్టులు. దీంతో ఎస్జీటీ టీచర్లు.. పీఎస్‌‌హెచ్‌‌ఎంగా ప్రమోషన్లు పొందేందుకు టెట్ అవసరం లేదనే వాదనలు ఉన్నాయి. టెట్ నిబంధన అమల్లోకి రాకముందే రిక్రూట్ అయిన ఎస్జీటీలకు కూడా టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలా లేదా అనే అయోమయం నెలకొంది. మరోవైపు స్కూల్ అసిస్టెంట్, గెజిటెడ్ హెడ్మాస్టర్ పోస్టులు అప్పర్ ప్రైమరీ/సెకండరీ లెవెల్ పోస్టులుగా ఉన్నాయి. దీంతో జీహెచ్‌‌ఎం పోస్టుకు టెట్ క్వాలిఫై అవసరమా లేదా అనే దానిపై కూడా కొంత స్పష్టత కరువైంది.

దీంతో పాటు లాంగ్వేజీ పండిట్లను అప్పర్ ప్రైమరీ లెవెల్ కోసం రిక్రూట్ చేశారు. వీరికి స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజెస్) ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై అవసరమా అనే సందేహం టీచర్లలో నెలకొంది. టీచర్ల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో మరోసారి వీటిపై స్పష్టత కోసం స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఇటీవల ఎన్‌‌సీటీఈకి లేఖ రాశారు. కాగా, తెలంగాణ నుంచి లేవనెత్తిన అనుమానాలపై ఒకటి రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని ఎన్‌‌సీటీఈ పెద్దలు చెప్పినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’తో చెప్పారు. ఎన్‌‌సీటీఈ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు.

అర్హతలు ఉంటేనే..

ఎన్‌‌సీటీఈ నిబంధనల ప్రకారం టీచర్లు ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్‌‌కు ప్రమోషన్ పొందాలంటే ఆ లెవెల్‌‌కు సంబంధించిన అర్హతలు ఉండాలని పేర్కొన్నారు. దీనిని టీచర్లు, అధికారులు వారికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. దీంతో అందరిలో అయోమయం నెలకొంది. ఎన్‌‌సీటీఈ ఉత్తర్వులు 2014 ప్రకారం స్కూళ్లను ప్రీప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీ/ హైస్కూల్, సీనియర్ సెకండరీ/ఇంటర్ ఇలా ఐదు లెవెల్స్‌‌గా మార్చారు. ప్రస్తుతం విద్యాహక్కు చట్టం ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే వర్తిస్తోంది. దీని ప్రకారం ఆయా లెవెల్స్‌‌లో పనిచేసే టీచర్లుకు మాత్రమే వర్తించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొందని టీచర్లు చెప్తున్నారు.