వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు మేమే చెల్లిస్తం

వలస కార్మికుల ప్రయాణ ఖర్చులు మేమే చెల్లిస్తం
  • కీలక నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్
  • వారి నుంచి చార్జీలు వసూలు చేయడంపై సోనియా ఫైర్

న్యూఢిల్లీ: లాక్​డౌన్ ఎఫెక్టుతో ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీల కోసం కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. వారి రైలు ప్రయాణ ఖర్చులను కాంగ్రెస్ భరిస్తుందని ఆ పార్టీ చీఫ్​ సోనియా గాంధీ ప్రకటించారు. కూలీలు, కార్మికులు, పేదల పక్షాన పార్టీ నిలుస్తుందని సోమవారం లేఖ ద్వారా తెలిపారు. కూలీలు, కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుక రైళ్లలో డబ్బులు వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సోనియా ఫైర్ అయ్యారు. వారిని సురక్షితంగా, ఉచితంగా తరలించాలన్న కాంగ్రెస్ డిమాండ్లను కేంద్రం, రైల్వే శాఖలు పూర్తిగా విస్మరించాయని ఆమె ఆరోపించారు.
ట్రంప్ పర్యటన సందర్భంగా గుజరాత్ లో సభకు రూ.100 కోట్లు ఖర్చు చేయగలిగిన కేంద్రం లాక్​డౌన్ ద్వారా చిక్కుకుపోయిన వలసదారులకు ఉచిత ప్రయాణం కల్పించలేదని సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం కేర్స్ ఫండ్​కు రూ.151 కోట్లు డొనేట్ చేసిన రైల్వే శాఖ.. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన కూలీల నుంచి టికెట్లు వసూలు చేయడం దారుణమని సోనియా మండిపడ్డారు. ఇలాంటి కష్ట కాలంలో వాళ్లను రైళ్లలో ఉచితంగా సొంతూళ్లకు పంపలేరా అని ప్రశ్నించారు. నాలుగు గంటల టైం ఇచ్చి లాక్​డౌన్ విధించారని, దీంతో కూలీలు ఎక్కడివాళ్లక్కడే చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. వేలాది మంది వలస కార్మికులు, కూలీలు వందల కిలోమీటర్ల కాలినడకన ఇళ్లకు వెళ్తున్నారని, తిండి, మెడిసిన్ అందుబాటులో లేక నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో చిక్కుకుపోయిన మైగ్రెంట్స్ ని విమానాల్లో తీసుకువచ్చిన కేంద్రం.. దేశంలో ఉన్న కార్మికులను సొంతూర్లకు ఉచితంగా తరలించలేదా అని సోనియా ప్రశ్నించారు.

‘‘ప్రతి పేద, నిరుపేద వలస కార్మికుడికి రైలు ప్రయాణానికి అయ్యే ఖర్చును ఆయా రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు భరిస్తాయి. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటాం. స్థానిక కాంగ్రెస్ నేతలు వలస కూలీలకు భరోసా ఇవ్వాలి”అని సోనియా గాంధీ లేఖలో పేర్కొన్నారు.