ఏంటది.. తీసెయ్.. లేడీ డాక్టర్ హిజాబ్ లాగేసిన సీఎం.. వివాదంలో బిహార్ సీఎం నితీష్ !

ఏంటది.. తీసెయ్.. లేడీ డాక్టర్ హిజాబ్ లాగేసిన సీఎం.. వివాదంలో బిహార్ సీఎం నితీష్ !

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఒక మహిళా వైద్యురాలి హిజాబ్ను ఆమె వద్దని నిలువరించినా సీఎం నితీష్ బలవంతంగా తొలగించడం పెను దుమారం రేపింది. పాట్నాలో సోమవారం జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. ఆయుష్ డాక్టర్లుగా కొత్తగా రిక్రూట్ అయిన వైద్యులకు అపాయింట్ మెంట్ లెటర్లను సీఎం నితీష్ కుమార్ అందజేశారు. ఈ క్రమంలో ఒక ముస్లిం మహిళా వైద్యురాలు అపాయింట్ మెంట్ తీసుకునేందుకు సీఎం దగ్గరకు వచ్చింది. ఆ యువ వైద్యురాలు హిజాబ్ ధరించి ఉంది. ఆమెకు అపాయింట్ మెంట్ లెటర్ అందజేసే క్రమంలో సీఎం నితీష్ ఆమె ముఖానికి ఉన్న హిజాబ్ను తొలగించే ప్రయత్నం చేశారు.

సీఎం చేసిన ఈ పనితో యువ వైద్యురాలు తీవ్ర అసౌకర్యానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై సదరు యువ వైద్యురాలు నుస్రత్ స్పందించింది. హిజాబ్ తీసేయాలని సీఎం తనకు చెప్పారని.. ఆ తర్వాత ఆయన చేతులతో హిజాబ్ను తొలగించేందుకు ప్రయత్నించారని చెప్పింది. ఆమె అసౌకర్యానికి గురవడంతో వేదిక మీద నుంచి వెళ్లిపోవాలని అధికారులు ఆమెను ఆదేశించారు. కొంతసేపటి తర్వాత అధికారులే ఆమెకు అపాయింట్మెంట్ లెటర్ను తీసుకొచ్చి ఇచ్చారు. 

సీఎం నితీష్ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మానసిక స్థితి పూర్తిగా గతి తప్పిందని.. తన ప్రవర్తనతో నితీష్ బాబు 100 శాతం సంఘీ అనిపించుకున్నారని ఆర్జేడీ ఎద్దేవా చేసింది. ఇదిలా ఉండగా.. ఆయుష్ ప్రాక్టిషనర్లకు అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ కార్యక్రమంలో మొత్తం 12 వందల 83 మంది వైద్యులు అపాయింట్ మెంట్ లెటర్లు అందుకున్నారు. 685 ఆయుర్వేదిక్ డాక్టర్లు, 393 మంది హోమియోపతి డాక్టర్లు, 205 మంది యునానీ డాక్టర్లు ఉన్నారు.