టికెట్ల కోసం .. కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీ 

టికెట్ల కోసం .. కాంగ్రెస్, బీజేపీలో పోటాపోటీ 
  • మెదక్​లో జోరుగా ఆశావహుల పైరవీలు
  • బీఆర్​ఎస్​లోని అసమ్మతి తమను గెలిపిస్తుందని ధీమా

మెదక్, వెలుగు : రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి కాంగ్రెస్, బీజేపీ టికెట్ల కోసం పలువురు లీడర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే మళ్లీ టికెట్​ కేటాయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉండే వ్యతిరేకత, పద్మా దేవేందర్ రెడ్డి​గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, ప్రధానమైన అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండడం, బీఆర్​ఎస్​ పార్టీలో నెలకొన్న అసమ్మతియే తమను ఈ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేస్తాయని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ఎవరికివారు జోరుగా పైరవీలు చేసుకుంటున్నారు. 

కాంగ్రెస్​లో.. 

కాంగ్రెస్ పార్టీలో డీసీసీ ప్రెసిడెంట్​ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్​రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాత్​రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ టికెట్​ రేసులో ఉన్నారు. వారు ఇటు ప్రజల, అటు పార్టీ హైకమాండ్​ దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి ఆశీస్సులు తనకే ఉన్నాయని, కాంగ్రెస్​ టికెట్​ తనకే వస్తుందన్న ధీమాలో తిరుపతిరెడ్డి ఉన్నారు. కాగా బీఆర్ఎస్​ టికెట్​ఆశించి భంగపడ్డ మైనంపల్లి సోషల్​సర్వీస్​ ఆర్గనైజేషన్​ చైర్మన్ డాక్టర్​ మైనంపల్లి రోహిత్​ కాంగ్రెస్​ పార్టీ హైకమాండ్ ​నుంచి టికెట్​ఇస్తామని స్పష్టమైన హామీ లభిస్తే ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

బీజేపీలో..

బీజేపీలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హైకోర్టు అడ్వకేట్​తాళ్లపల్లి రాజశేఖర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, సేవా కార్యక్రమాలు చేపడుతున్న టికెట్​ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ముదిరాజ్​ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని, నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్​ కుమార్ ​టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే నాయకుడు నందు జనార్ధన్​రెడ్డి, మాజీ మంత్రి కరణం రాంచందర్​ రావు కోడలు కరణం పరిణిత, పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ కూడా టికెట్​ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.