బీసీలు సీఎం కావడం కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఇష్టం లేదు ​: లక్ష్మణ్​

బీసీలు సీఎం కావడం కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఇష్టం లేదు ​: లక్ష్మణ్​
  • 7న హైదరాబాద్​లో పీఎం చీఫ్ గెస్ట్ గా ‘బీసీల ఆత్మగౌరవ సభ’

న్యూఢిల్లీ, వెలుగు: వెనుకబడిన వర్గాల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చులకన భావంతో ఉన్నా యని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఒక బీసీ అభ్యర్థి సీఎం కావడం ఆ పార్టీలకు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ  చేస్తున్న వ్యాఖ్యలు యావత్ బీసీ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. దేశంలో ఇన్నేండ్లు అధికారంలో ఉండి వెనుకబడిన వర్గాలకు ఏమీ చేయలేని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు విస్మరించబడిన వర్గాలకు బీజేపీ మేలు చేస్తుంటే జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ‘బీజేపీ బీసీని ప్రధానమంత్రిని చేస్తే కాంగ్రెస్ సహించదు. ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే సహించదు. మీరు చేయరు.. చేసే వారిని చూస్తే మీకు కళ్లమంట. బీసీలకు రాజ్యాధికారం దక్కుతుంటే మీకొచ్చిన సమస్యేంటి?’ అని లక్ష్మణ్ ప్రశ్నించారు. మోదీ, అమిత్ షా ఏదైనా చెప్పారంటే చేసి చూపిస్తారని, ఇప్పటికే బీసీల సంక్షేమం కోసం వివిధ ప్రోగ్రాంలు చేపట్టారన్నారు.

బీసీలకు రాజ్యాధికారం దిశగా బీజేపీ.. దేశవ్యాప్తంగా 1,358 మంది బీసీలను ఎమ్మెల్యేలుగా, 85 మందిని లోక్ సభలో, 30 మందిని రాజ్యసభలో ఎంపీలను చేసిందన్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో  తెలంగాణలో 3 సీట్లు మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీ..  రెండేండ్లుగా రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా డిపాజిట్లు దక్కించుకోలేదన్నారు. అటు కేసీఆర్ కూడా రాష్ట్రంలో బీసీలను నిరంతరం అవమానాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీసీ సబ్ ప్లాన్ కు నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు. బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో ‘బీసీల ఆత్మగౌరవ సభ’ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని లక్ష్మణ్​ వెల్లడించారు.