కేసీఆర్, పీకే వ్యూహాలు ఇక పని చేయవు

కేసీఆర్, పీకే వ్యూహాలు ఇక పని చేయవు

హైదరాబాద్: కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని, అవి రెండూ ఒకటేనని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ ఆరోపించారు. ఇక్కడ టీఆర్ఎస్ కు, ఢిల్లీలో కాంగ్రెస్ కు పీకే ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్ష్మణ్ స్పందించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే కాబట్టి ఆ రెండు పార్టీలకు పీకే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారని పేర్కొన్నారు. మొన్నటి దాకా కాంగ్రెసేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేసీఆర్... పీకే రాకతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ కలిసి పని చేసేలా పీకే వ్యూహాలు పన్నుతున్నారన్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ తో కాంగ్రెస్ దోస్తీ కట్టనుందన్నారు.

అయితే కేసీఆర్, పీకే వ్యూహాలు ఇక తెలంగాణలో పనిచేయబోవన్న ఆయన... కేసీఆర్ గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ కే ప్రధాన పోటీదారులు కేఏ పాల్, ఎంఐఎం అని మంత్రి కేటీఆర్ అంటున్న తీరు చూస్తుంటే... కేటీఆర్ రాజకీయ తెలివి ఏపాటిదో అర్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఎవరెన్ని వ్యూహాలు రచించినా ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

ఈ నెల 30న ఢిల్లీలో సీఎంలు, సీజేఐల సదస్సు

తమిళనాడును విభజించే కుట్ర