కాంగ్రెస్​ అభ్యర్థుల ఖరారు నేడే!

కాంగ్రెస్​ అభ్యర్థుల ఖరారు నేడే!
  • ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్​ క్యాండిడేట్లను ప్రకటించే చాన్స్ 

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం ప్రకటించనున్నట్టు తెలిసింది. పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లలో అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా, ఇందులో 14 సీట్లకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు.

ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఖమ్మం టికెట్ కోసం విపరీతమైన పోటీ ఉండడంతో అక్కడ అభ్యర్థిని ఖరారు చేయడం హైకమాండ్ కు సవాల్ గా మారింది. ఖమ్మం సీటుతో ముడిపడి ఉండడంతో కరీంనగర్, హైదరాబాద్ కూడా పెండింగ్ లో పడ్డాయి. కాగా, ఈ మూడు సీట్లపై ఇప్పటికే పలుమార్లు జరిగిన సీఈసీ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 25 వరకే నామినేషన్లకు గడువు ఉండడంతో సోమవారం అభ్యర్థులను ప్రకటించే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఆగితే, మంగళవారం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నాయి. 

ఏపీలో 9 సీట్లకు ఖరారు.. 

ఏపీ, జార్ఖండ్ లో మిగిలిన స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో 9, జార్ఖండ్ లో 2 సీట్లకు అభ్యర్థుల లిస్టును పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు. ఏపీలోని శ్రీకాకుళం నుంచి పెద్దాడ పరమేశ్వర రావు, విజయనగరం–బొబ్బిలి శ్రీను, అమలాపురం (ఎస్సీ)–-జంగా గౌతమ్, మచిలీపట్నం – గొల్లు కృష్ణ, విజయవాడ–-వల్లూరు భార్గవ్, ఒంగోలు – జంగిటి లక్ష్మీనరసింహ యాదవ్, అనంతపురం–-మల్లికార్జున్ వజ్జల, హిందూపురం నుంచి బీఏ సమద్ షహీన్ కు టికెట్ ఇచ్చారు.