కొత్త ట్రెండ్​.. హామీల బాండ్ .. 40-50 నియోజకవర్గాల్లో బాండ్​ రాసిచ్చిన కాంగ్రెస్​ అభ్యర్థులు

కొత్త ట్రెండ్​.. హామీల బాండ్ .. 40-50 నియోజకవర్గాల్లో బాండ్​ రాసిచ్చిన కాంగ్రెస్​ అభ్యర్థులు

హైదరాబాద్​, వెలుగు: ఆరు ప్రధాన హామీలతో కాంగ్రెస్​ గ్యారెంటీలను ప్రకటించింది. చేవెళ్లలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సోనియా గాంధీ చేతుల మీదుగా గ్యారెంటీలను విడుదల చేసింది. ఆ హామీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని ప్రతి సభలో, ఇంటింటి ప్రచారంలోనూ జనానికి నేతలు, అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. 

ఈ క్రమంలోనే ఆ హామీలన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్​ అభ్యర్థులంతా స్వయంగా ప్రజలకు హామీ పత్రాన్ని (అఫిడవిట్లు)/బాండ్​ రాసిస్తున్నారు. దైవ సాక్షిగా ప్రమాణం చేసిమరీ ఆ హామీ పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, గండ్ర సత్యనారాయణ (భూపాలపల్లి), జీవన్​ రెడ్డి (జగిత్యాల), పొన్నం ప్రభాకర్​ (హుస్నాబాద్​), వేముల వీరేశం (నకిరేకల్​), గడ్డం వినోద్​ (బెల్లంపల్లి), ఎ. చంద్రశేఖర్​ (జహీరాబాద్​), ఏనుగు రవీందర్​ రెడ్డి (బాన్సువాడ) సహా రాష్ట్రంలోని ఎమ్మెల్యే అభ్యర్థులంతా గ్యారెంటీలను అమలు చేసే గ్యారెంటీ తమది అని అఫిడవిట్లు రాసిస్తున్నారు. ఈ లీడర్లంతా ఇలా రాజకీయాల్లో కొత్త ట్రెండ్​కు తెరతీశారు. ఈ క్రమంలోనే తమను గెలిపిస్తే అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామంటూ నలభై యాభై నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు హామీ పత్రం రాసిస్తున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా లీడర్లంతా బాండ్​ రాసిస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది. 

పసుపుబోర్డు తెస్తానని అరవింద్​...

అఫిడవిట్లు ఇవ్వడం ఇప్పుడు ట్రెండింగ్​లో ఉంది. 2019 లోక్​సభ ఎన్నికల్లోనూ పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అరవింద్​ హామీ పత్రాన్ని రాసిచ్చారు. పసుపు బోర్డు లేట్​ కావడంతో అధికార బీఆర్​ఎస్​ సహా, కాంగ్రెస్​ నేతలు అరవింద్​ హామీ పత్రాన్ని తెరపైకి తెచ్చారు. పసుపు బోర్డు తెస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తూ.. ఆ బాండ్​ పేపర్​ను వైరల్​ చేశారు. తాజాగా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులూ తమను గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని బాండ్లు రాసిస్తున్నారు. 

రాసిస్తేగానీ నమ్మే పరిస్థితి లేదు..

ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు గుప్పిస్తుంటాయి. ఆపై అధికారం రాగానే పక్కనపడేస్తుంటాయి. సీఎం కేసీఆర్​ కూడా ఇలాగే ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, పోడు పట్టాలు, డబుల్​ బెడ్రూం ఇండ్లు, ఉచిత ఎరువులు.. తదితర హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడు బీఆర్​ఎస్​తో పాటు కాంగ్రెస్​ పార్టీ, బీజేపీ కూడా మేనిఫెస్టోల్లో హామీలు గుప్పించాయి. 

ఈ హామీలు  కూడా అధికారంలోకి వచ్చాక మర్చిపోతారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాము తూచా తప్పకుండా ఇచ్చిన హామీలను అమలు చేస్తామంటూ బాండ్​ పేపర్​ మీద రాసివ్వాలని కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలే అభ్యర్థులను నిలదీస్తున్నారు. అలా రాసిస్తేనయినా గెలిచాక అమలు చేయకపోతే నిలదీయొచ్చని భావిస్తున్నారు. దీంతో చాలా మంది లీడర్లు హామీలు చేస్తమంటూ బాండ్ పేపర్లమీద రాసిస్తున్నారు.