
- బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటన
- బీసీ యువకులకు వడ్డీ లేకుండా రూ.10 లక్షల లోన్
- బీసీ ‘ఏ’లోకి ముదిరాజ్, ముత్రాసు, తెనుగు సామాజిక వర్గాలు
- వైన్ షాపుల కేటాయింపులో గౌడ్లకు 25 % కోటా కల్పిస్తామని హామీ
- తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ అంగడి సరుకులా మార్చిండు: రేవంత్
- ప్రజాప్రతినిధుల కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్
- కేసీఆర్ కర్నాటకకు వస్తే గ్యారంటీల అమలు చూపిస్త: సిద్ధరామయ్య
- బీఆర్ఎస్‌ను ఓడిస్తేనే అమరుల త్యాగాలకు అర్థం: కోదండరాం
- కేసీఆర్ ఇక ఫామ్‌హౌస్‌కే పరిమితం: సీపీఐ నేత నారాయణ
కామారెడ్డి/ హైదరాబాద్, వెలుగు: తాము అధికారంలోకి వస్తే బీసీల సంక్షేమానికి ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏటా రూ.20 వేల కోట్లను అందజేస్తామని చెప్పింది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి 6 నెలల్లోనే కుల గణన చేపడుతామని తెలిపింది. బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. యువత వ్యాపారాలు పెట్టుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.పది లక్షల వడ్డీ లేని, పూచీకత్తు లేని లోన్లు ఇస్తామని పేర్కొంది. శుక్రవారం కామారెడ్డిలో జరిగిన సభలో బీసీ డిక్లరేషన్‌ను పార్టీ ప్రకటించింది. బీసీల రిజర్వేషన్లను వర్గీకరిస్తామని డిక్లరేషన్‌లో పేర్కొంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 23 శాతం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని పార్టీ ప్రకటించింది. దీంతో 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కుతుందని పేర్కొంది. ప్రభుత్వ సివిల్ కన్‌స్ట్రక్షన్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది.
అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.50 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని, ఈ భవనాల్లో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్ ఉంటాయని తెలిపింది. బీసీ సంక్షేమ కార్యాలయాలు కూడా ఈ భవనాల్లో ఉంటాయని ప్రకటించింది. ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కాలేజీ, బీసీ యువత వ్యాపారాలు పెట్టుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.పది లక్షల వడ్డీ లేని, పూచీకత్తు లేని లోన్లు ఇస్తామని కాంగ్రెస్ తెలిపింది. రూ.3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న బీసీ కుటుంబాల యువతకు ర్యాంక్‌తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తామని చెప్పింది. ప్రతి మండలంలో బీసీ గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.
మండలానికో వృత్తి బజార్
వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలానికో షాపింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ కాంప్లెక్స్‌లో 50 దుకాణాలు ఉంటాయని బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పేర్కొంది. నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, రజకులు, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి వాటిని ఉచితంగా కేటాయిస్తామని హామీ ఇచ్చింది. గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏండ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సునే మిగతా అన్ని చేతి వృత్తుల వారికి వర్తింపజేస్తామని తెలిపింది. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని, ప్రతి సొసైటీకి రెగ్యులర్‌గా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది.
వంద రోజుల్లోనే గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ
ముదిరాజ్, ముత్రాసు, తెనుగు సామాజిక వర్గాలను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మారుస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహిస్తామని, క్యాప్టివ్ సీడ్ నర్సరీలు, మార్కెటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గొల్లకురుమలకు రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది.
వైన్ షాపుల్లో 25 శాతం రిజర్వేషన్లు
మద్యం షాపుల లైసెన్సుల్లో గౌడ్లకు ప్రస్తుతమున్న 15 శాతం రిజర్వేషన్లను 25 శాతానికి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని, ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తామని తెలిపింది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడుతామని ప్రకటించింది. తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాలు అందజేస్తామని తెలిపింది.
రజక యువతకు రూ.10 లక్షలు
జగిత్యాల, నారాయణపేట, భువనగిరి జిల్లాల్లో మెగా పవర్‌లూమ్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. పద్మశాలీలకు పవర్ లూమ్స్‌తో పాటు, అవసరమైన పరికరాలపై 90 శాతం సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చింది. నాయీ బ్రాహ్మణులు, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90 శాతం సబ్సిడీతో టూల్ కిట్లు అందజేస్తామని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చింది. రజక యువతకు పట్టణాల్లో లాండ్రోమెట్స్ ఏర్పాటు చేసుకునేందుకు రూ.10 లక్షలు ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ధోబీ ఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది.
మండలానికో వృత్తి బజార్
వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలానికో షాపింగ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ కాంప్లెక్స్‌లో 50 దుకాణాలు ఉంటాయని బీసీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పేర్కొంది. నాయీ బ్రాహ్మణులు, వడ్రంగులు, రజకులు, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి వాటిని ఉచితంగా కేటాయిస్తామని హామీ ఇచ్చింది. గీత కార్మికులు, చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏండ్ల వృద్ధాప్య పింఛన్ అర్హత వయస్సునే మిగతా అన్ని చేతి వృత్తుల వారికి వర్తింపజేస్తామని తెలిపింది. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి రూ.పది లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని, ప్రతి సొసైటీకి రెగ్యులర్‌గా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది.