హస్తినలో తెలంగాణ.. కాంగ్రెస్, బీజేపీ స్టేట్ చీఫ్ లు అక్కడే

హస్తినలో తెలంగాణ..  కాంగ్రెస్, బీజేపీ స్టేట్ చీఫ్ లు అక్కడే
  • హస్తినలో తెలంగాణ
  •  కాంగ్రెస్, బీజేపీ స్టేట్ చీఫ్ లు అక్కడే
  •  త్వరలో ఇద్దరి స్థానంలో కొత్తవారు
  •  పదవీకాలం ముగియడంతోనే మార్పు
  •  ప్రయత్నాల్లో చీఫ్​ పోస్ట్ ఆశావహులు
  •  ఢిల్లీలోనే మకాం వేసిన జగ్గారెడ్డి
  •  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో నలుగురు

హైదరాబాద్: తెలంగాణ కీలక నేతలు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి టెన్యూర్ పూర్తవడంతో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. త్వరలో రెండు జాతీయ పార్టీలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా కొత్తవారు నియమితులయ్యే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ పదవిని తమకే ఇవ్వాలని ఇప్పటికే పలువురు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సురేశ్ షెట్కార్, బీసీ కోటాలో పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. వీళ్లంతా తమ చానళ్ల ద్వారా లాబీయింగ్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఎస్టీ కోటాలో ఈ పదవిని మంత్రి సీతక్క, మానుకోట ఎంపీ బలరాం నాయక్ ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మాదిగ సామాజికవర్గం కోటాలో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. పీసీసీ చీఫ్​ నియామకం తర్వాతే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. దీంతో ఈ అంశంపై హైకమాండ్  రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

బీజేపీలో నలుగురు

కిషన్ రెడ్డి  ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలువడంతో ఆయనకు మంత్రిపదవి పక్కా అనే సంకేతాలొస్తున్నాయి. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించడం ఖాయమనే ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. స్టేట్ కొత్త చీఫ్ నియామకం కూడా ఈ నెలలోనే ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. స్టేట్ చీఫ్ పోస్ట్ కోసం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పోటీలో ఉన్ నారని సమాచారం. బీసీ వర్గానికే ఈ పదవిని కట్టబెడుతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పాయల్ శంకర్ లేదా ఈటల రాజేందర్ లతో ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. ఎన్డీఏ పక్ష ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి నూతన అధ్యక్షుడి అంశంపై జాతీయ నాయకత్వంతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి గెలిచిన వారిలో ఈ దఫా కిషన్  రెడ్డికి కేంద్ర కేబినెట్ లో స్థానం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్ర బీజేపీకి కొత్త చీఫ్ ను వెంటనే నియమించే అవకాశం ఉంది.