కాంగ్రెస్​, బీఆర్ఎస్ ​నడుమ ..ప్రాజెక్టులపై మాటల యుద్ధం

కాంగ్రెస్​, బీఆర్ఎస్ ​నడుమ ..ప్రాజెక్టులపై మాటల యుద్ధం
  • కాంగ్రెస్ ​టైంలో నిర్మించిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్న భట్టి
  • చర్చకు రావాలని బీఆర్ఎస్​కు సవాల్​
  • తాను సిద్ధమేనన్న మంత్రి జగదీశ్​రెడ్డి
  • ఆ రెండు ప్రాంతాల్లో ఎక్కడైనా రెడీ అన్న మినిస్టర్​ 
  • నల్గొండ జిల్లాలో వేడెక్కిన రాజకీయాలు 

నల్గొండ, వెలుగు :  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ​ముఖ్య నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ప్రాజెక్టులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడడం, దీనికి మంత్రి జగదీశ్​రెడ్డి కౌంటర్​ ఇవ్వడం ఇప్పుడు కాక పుట్టిస్తోంది. కాంగ్రెస్​ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం బీఆర్ఎస్ అని మల్లు భట్టి విక్రమార్క తన పీపుల్​మార్చ్​ యాత్రలో కామెంట్​చేశారు. ప్రాజెక్టులపైన మంత్రి జగదీశ్ రెడ్డికి సోయి లేదని, ఎంపీగా, మండలి చైర్మన్​గా ఉన్న గుత్తా సుఖేందర్​ రెడ్డి కృషి చేయాలని సలహా ఇచ్చారు. 

నక్కలగండి, పెళ్లిపాకల కింద ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవడంలో జిల్లా లీడర్లు విఫలమయ్యారని ఫైర్​ అయ్యారు. చర్చకు వస్తే నిరూపిస్తానని సవాల్​ విసిరారు. భట్టి కామెంట్స్​పై స్పందించిన మంత్రి జగదీశ్​రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా ఎదురుదాడికి దిగారు. మంత్రి జగదీశ్​రెడ్డి తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్​, బీఆర్ఎస్​ లీడర్ల విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం మరింత వేడెక్కింది.  

జిల్లా సాగునీటి ప్రాజెక్టులే​ టార్గెట్​

జిల్లాలో నాలుగు రోజులుగా పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్​హయాంలో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ప్రారంభించిన శ్రీశైలం సొరంగ మార్గం(ఎస్​ఎల్​బీసీ), నక్కలగండి, పెళ్లిపాకల, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టులు అతీగతీ లేకుండా పోయాయని ధ్వజమెత్తారు. జిల్లా మంత్రి జగదీశ్​రెడ్డి, మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డిపై విరుచుకుపడ్డారు. కనీసం నక్కలగండి రిజర్వాయర్​ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పనిలో పనిగా కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులు, పవర్​ ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వ  నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. 

నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ ​విసిరారు. భట్టి సవాల్​విసిరిన రెండు రోజులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి స్పందించారు. తన కృషి వల్లే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ఆసియాలోని ఇరిగేషన్ ​ప్రాజెక్టులకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. దామచర్ల యాదాద్రి పవర్​ప్లాంట్​, డిండి లిఫ్ట్​ఇరిగేషన్, ఎస్​ఎల్​బీసీ సొరంగ పనుల వెనక తాను చేసిన కృషి ఉందన్నారు. అధికారంలోకి రావాలన్న కుట్రతోనే కాంగ్రెస్ లీడర్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. విద్యుత్ ​శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి అయితే ఏకంగా తాను చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. మరోవైపు ఆదివారం నల్గొండలోని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి క్యాంప్​ ఆఫీసులో జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఉత్తమ్, జానారెడ్డి నియోజకవర్గాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. కాంగ్రెస్​ లీడర్లు పదవుల కోసం పాకులాడటమే తప్పా జిల్లాకు చేసిందేమీ లేదన్నారు.  

నల్గొండలో  హీట్ ​ పెరిగే ఛాన్స్​ 

ఈ నెల 14వ తేదీ నుంచి భట్టి యాత్ర నల్గొండ నియోజకవర్గంలో కొనసాగనుంది. భట్టి యాత్రను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బహిరంగ సభపెట్టి ప్రాజెక్టులతో పాటు, ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టాలని ప్లాన్​ చేస్తున్నారు. తొలి దశలో ప్రాజెక్టులు, ముఖ్యనేతలపైన విరుచుకుపడ్డ కాంగ్రెస్ ​లీడర్లు, నల్గొండలో ఎమ్మెల్యేల అవినీతిని కూడా టార్గెట్ ​చేసేందుకు వ్యూహం  రూపొందిస్తున్నట్లు తెలిసింది.

ప్రాజెక్టులపై చర్చకు వస్తావా

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్న ఉత్తమ్​కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టైంలోనే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించడానికి ఎస్ఎల్​బీసీ ప్రాజెక్టు తెచ్చినం. టెండర్లు పిలిచి పనులు కూడా చేయించారు. చివరి దశలో మిగిలిపోయిన పనులను బీఆర్ఎస్​ తొమ్మిదేండ్ల నుంచి కంప్లీట్​ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 2017లోనే ఎస్​ఎల్​బీసీ పూర్తి చేసి ఉంటే నక్కలగండి, పెళ్లిపాకల ప్రాజెక్టులకు నీళ్లొచ్చేవి. దామచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంకా పూర్తి కాలేదు. భద్రాద్రి పవర్​ ప్రాజెక్టు అట్లనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పవర్ ప్రాజెక్టుల పనులను ఇప్పుడు పూర్తి చేసి, ఆ వెలుగులు మావే అని చెప్పుకుంటున్నారు. మళ్లీ సవాల్​ చేస్తున్నా..రాష్ట్రంతో పాటు నల్గొండ జిల్లాలో చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పవర్​ప్రాజెక్టులపై మేం చర్చకు సిద్ధం.  మీరు సిద్ధమేనా? 

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఉత్తమ్​, జానా నియోజకవర్గాల్లో ఎక్కడైనా రెడీ

ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిపై ఉత్తమ్​కుమార్​రెడ్డి నియోజకవర్గంలోని జాన్​పహాడ్​లో చర్చిద్దామా... లేదంటే జానారెడ్డి నియోజకవర్గం నాగార్జునసాగర్​లోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న రాజవరంలో చర్చ పెడదామా..మీరే తేల్చుకోండి. ఆంధ్ర పాలకులైన వైఎస్సార్,  చంద్రబాబు కాలంలో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్న నాయకులు మీరు. ఎస్​ఎల్​బీసీ సొరంగ మార్గాన్ని పర్యావరణ అనుమతుల పేరుతో అప్పటి పాలకులే ఆపే విధంగా చేశారు. జిల్లా రైతులకు నీళ్లు రాకుండా దుర్మార్గంగా పాలించిన వైఎస్సార్​ను నెత్తిన పెట్టుకున్న కాంగ్రెస్​ లీడర్లకు సిగ్గుండాలి.  కాంగ్రెస్ హయాంలో వరుసగా రెండు పంటలకు నీళ్లివ్వలేదు. తెలంగాణ వచ్చాక వరుసగా 16 పంటలకు నీళ్లిచ్చినం. 24గంటల కరెంట్​గురించి ఏ సబ్ స్టేషన్లలో అయినా కూర్చుని చర్చ చేద్దాం. నేను రెడీ..  

- జి.జగదీశ్​​ రెడ్డి, విద్యుత్​ శాఖ మంత్రి