కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. నిలిచిపోయిన ఎన్నిక

కాంగ్రెస్ అభ్యర్థి కన్నుమూత.. నిలిచిపోయిన ఎన్నిక

రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే.. 2023, నవంబర్ 25వ తేదీ జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గుర్మీత్ సింగ్ చనిపోయారు. ఆయన ఇటీవలే కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇంతలోనే ఇలా జరగటంతో.. ఆ స్థానంలో ఎన్నిక నిలిచిపోనుంది. 

గుర్మీత్ సింగ్ వయస్సు 75 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు హై బీపీ ఉంది. దీంతో కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. నవంబర్ 14వ తేదీ రాత్రి ఆయన శరీరంలోని అన్ని అవయవాల పనితీరుపై ప్రభావం పడి.. కన్నుమూశారు. 

ప్రస్తుతం కరణ్ పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. రాబోయే ఎన్నికల్లోనూ సీటు దక్కించుకున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత.. మరో 10 రోజుల్లో పోలింగ్ ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చనిపోవటంతో ఎన్నిక వాయిదా పడనుంది. దీనిపై ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

2018 ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పట్లో నామినేషన్ల దాఖలు చేసిన తర్వాత.. రాయ్ గఢ్ నియోజకవర్గం బీఎస్పీ అభ్యర్థి గుండెపోటుతో చనిపోవటంతో.. అక్కడ ఎన్నిక వాయిదా పడింది. 2023 ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనే మల్లీ రిపీట్ కావటం చర్చనీయాంశం అయ్యింది.