సైదిరెడ్డి ఆగడాలకు బదులు తీసుకుంటం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

సైదిరెడ్డి ఆగడాలకు బదులు తీసుకుంటం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

గరిడేపల్లి, మఠంపల్లి, వెలుగు : హుజూర్ నగర్‌‌లో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆగడాలను తట్టుకొని నిలబడ్డ ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నానని, అధికారంలోకి రాగానే కచ్చితంగా బదులు తీసుకుంటామని ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి  హెచ్చరించారు.  సోమవారం గరిడేపల్లి, మఠం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని గ్రామాలను తన బంధువులకు అప్పజెప్పి విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు.  

ఎమ్మెల్యే ఆఖరికి వైన్ షాపులను కూడా వదల్లేదని, యజమానులను బెదిరించి ఒక్కో వైన్ షాప్ నుంచి రూ. 4 లక్షల వసూలు చేశాడని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌‌ ఓటమి భయంతోనే నాగార్జున సాగర్ డ్యాం గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.  నాయకులతో పాటు ఎమ్మెల్యేకు సహకరించిన అధికారులను వదిలిపెట్టేది లేదని, వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. 60 ఏండ్ల కింద కట్టిన నాగార్జునసాగర్ ఇప్పటికీ చెక్కుచెదరలేదని,  కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే కుంగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కమీషన్ల కోసం కక్కుర్తి పడి నాసిరకంగా ప్రాజెక్టు కట్టారని అందుకే మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయాయని ఆరోపించారు.  నేతలు 100 ఓట్లకు ఒక బూత్ కన్వీనర్ ఉండేలా చూసుకోవాలని, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ కార్డు ప్రతి ఇంటికి చేరవేయాలన్నారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన బీఆర్‌‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు.