నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ మాట మార్చింది : కేటీఆర్

నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ మాట మార్చింది : కేటీఆర్
  •     రైతులు లోన్లు కట్టకుంటే కేసులు పెడ్తరట: కేటీఆర్
  •     అసెంబ్లీ సాక్షిగా భట్టి విక్రమార్క అబద్ధం చెప్పారు
  •     హామీల అమలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శ

హైదరాబాద్, వెలుగు: రైతులు తీసుకున్న పంట రుణాలు వసూలు చేయాలంటూ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోన్లు కట్టకుంటే కేసులు పెట్టాలని కూడా ఆదేశించినట్టు తెలిసిందని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇస్తే.. అలాంటి హామీ ఇవ్వలేదంటూ కాంగ్రెస్ మాట మార్చిందని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అబద్ధం చెప్పారని మండిపడ్డారు.

శుక్రవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన మెదక్ లోక్​సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘‘పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా తెస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు సాధ్యం కాదని అంటున్నరు. 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. వాటిని నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. గవర్నర్ ప్రసంగంలోనే తెలంగాణ విఫల రాష్ట్రం అయ్యిందని అబద్ధాలు చెప్పించారు. అందుకే మేము స్వేదపత్రం విడుదల చేశాం. పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.

అధికారం కోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చిన్రు. వాటిని అమలు చేసే దాకా ప్రభుత్వాన్ని విడిచిపెట్టం’’అని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో అదానీ అడుగు పెట్టలేదని కేటీఆర్ అన్నారు. రేవంత్ సీఎం కాగానే దావోస్​లో ఆయనతో ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. డబుల్ ఇంజిన్ అంటే.. అదానీ, ప్రధాని అని విమర్శించిన రేవంత్ రెడ్డే ఆయనతో అగ్రిమెంట్ చేసుకున్నారని అన్నారు. ‘‘కేసీఆర్, హరీశ్ నాయకత్వంలో పార్టీ చాలా యాక్టివ్​గా పని చేయడంతోనే గత లోక్​సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచాం. ఈసారి కూడా మెదక్​లో ఎగిరేది గులాబీ జెండానే. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే’’అని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నిరాశ నుంచి బయటికొచ్చి కలిసికట్టుగా పని చేయాలన్నారు. బీజేపీ చేసిన తప్పులను ప్రశ్నించేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోనే మన ఆయుధం: హరీశ్ రావు

కాంగ్రెస్ మేనిఫెస్టోనే మనకు ఆయుధమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, భవిష్యత్తులో వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని ధీమా వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందన్నారు. కేసీఆర్ ఎన్నో అవమానాలు భరించి నిలబడితేనే తెలంగాణ వచ్చిందన్నారు. కాగా, కేసీఆర్, కేటీఆర్, హారీశ్ రావు అసెంబ్లీలోనే ఉండి కాంగ్రెస్ సర్కార్​పై పోరాటం చేయాలని పార్టీ లీడర్లు కోరారు. లోక్​సభకు పోటీ చేస్తామంటే కేడర్ ఊరుకోదని చెప్పారు.  కవిత ఎంపీగా పోటీ చేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.