సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం: మల్లికార్జున్ ఖర్గే

సవాళ్లను దీటుగా ఎదుర్కొంటాం: మల్లికార్జున్ ఖర్గే

న్యూఢిల్లీ:‘జుడేగా భారత్.. జీతేగా ఇండియా’ నినాదంతో ‘ఇండియా’ కూటమి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉందని, ఎలాంటి సవాల్ అయినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం తనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు వివరించారు. ప్రజల తరఫున గళం వినిపించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ముగ్గురు భేటీకి సంబంధించిన ఫొటోను ఖర్గే ట్విట్టర్​లో పోస్టు చేశారు. 

ఇండియా కూటమిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో రెండు రోజుల భేటీ తర్వాత కూటమి లీడర్లు సమావేశం కాలేదు. త్వరలో మళ్లీ కూటమి లీడర్లు భేటీ అయ్యే విషయమై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది. అదేవిధంగా, ఎజెండాపై బ్రీఫ్​గా చర్చించినట్లు సమాచారం. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అలయెన్స్ రోడ్ మ్యాప్, ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల అంశాలపై 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తున్నది. 

ఎన్సీపీ ఎమ్మెల్యేలు జితేంద్ర అహవద్, గుర్దీప్ సప్పాల్, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు శరద్ పవార్ వివరించారు. తర్వాతి  ‘ఇండియా’ కూటమి భేటీ.. వెస్ట్ బెంగాల్​లో నిర్వహించేందుకు ప్రతిపక్ష లీడర్లు ప్లాన్ చేస్తున్నారు.